టి20 ప్రపంచ కప్ కు బంగ్లాదేశ్ జట్టు... కెప్టెన్ గా హిందువు!
భారత్-శ్రీలంకలో వచ్చే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనున్న టి20 ప్రపంచ కప్ నకు బంగ్లాదేశ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది.
By: Tupaki Desk | 5 Jan 2026 9:17 AM ISTభారత్-శ్రీలంకలో వచ్చే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనున్న టి20 ప్రపంచ కప్ నకు బంగ్లాదేశ్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్ లను భారత్ లోని కోల్ కతా (3), ముంబై (1)లో ఆడాల్సి ఉన్న బంగ్లాదేశ్.. తమ దేశ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి పంపించివేయడంతో ఆగ్రహంగా ఉంది. రూ.9.20 కోట్లకు ముస్తాఫిజుర్ ను మినీ వేలంలో దక్కించుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదేశాల మేరకు జట్టు నుంచి రిలీజ్ చేసింది. బంగ్లాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో హిందువులను లక్ష్యంగా చేసుకుంటూ అల్లరి మూకలు హత్యలు, దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్ లో ఆడిస్తారా? అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ ను తప్పించాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఇది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ప్రతిగా టి20 ప్రపంచ కప్ సందర్భంగా భారత్ లో తాము ఆడాల్సిన మ్యాచ్ లను మరో ఆతిథ్య దేశం పాకిస్థాన్ కు తరలించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ)ని కోరేందుకు సిద్ధమైంది. ఈ వేదిక మార్పులు ఎలా ఉన్నా...టి20 ప్రపంచ కప్ నకు బంగ్లా ప్రకటించిన జట్టు కెప్టెన్ గా హిందువును నియమించారు. చాలాకాలంగా ఆ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ను సారథిగా ప్రకటించడం సహజమే అయినా... ప్రస్తుత పరిణామాల్లో ఒక హిందువును కెప్టెన్ గా కొనసాగించడం చర్చనీయంగా మారింది.
గతంలో వేటు.. ఇప్పుడు కెప్టెన్
హిందువైన వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ టి20 ప్రపంచ కప్ లో బంగ్లా జట్టును నడిపించనున్నాడు. 2024 మార్చిలో వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన లిటన్.. తిరిగి వచ్చాడు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ (టి20 ఫార్మాట్ )లోనూ బంగ్లా కెప్టెన్ ఇతడే. కానీ, భారత్ తో సూపర్ 4 మ్యాచ్ కు వెన్నునొప్పి కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకోవడంతో వెస్టిండీస్, ఐర్లాండ్ తో సిరీస్ లలో కెప్టెన్సీ చేపట్టాడు. ఇప్పుడు ప్రపంచ కప్ లోనూ నడిపించనున్నాడు.
పదేళ్లకు పైగా..
31 ఏళ్ల లిటన్.. 2015 నుంచి బంగ్లాకు మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. 52 టెస్టులు, 95 వన్డేలు, 120ల్లో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా జట్టులోకి వచ్చినా.. బ్యాటర్ గా స్థిరపడ్డాడు. ఇక బంగ్లా తమ టి20 ప్రపంచ కప్ జట్టుకు సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్ ను మళ్లీ తీసుకుంది. ఐపీఎల్ జట్టు కేకేఆర్ నుంచి పరిస్థితుల రీత్యా తప్పించిన ముస్తాఫిజుర్ కూడా ఈ 15 మంది సభ్యుల టీమ్ లో ఉన్నాడు. కాగా, బంగ్లాదేశ్ కు గతంలోనూ ఓ హిందూ ఆటగాడు ప్రాతినిధ్యం వహించాడు. అతడి పేరు సౌమ్య సర్కార్. ఎడమచేతి వాటం బ్యాటర్, కుడిచేతి మీడియం పేసర్ అయిన 33 ఏళ్ల సౌమ్య సర్కార్ 2014లో బంగ్లా తరఫున అరంగేట్రం చేశాడు.
