Begin typing your search above and press return to search.

చిన్నస్వామి దుర్ఘటన.. దేశ చరిత్రలో అతిపెద్ద క్రీడా విషాదం అదే

కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి మైదానం ఎంతో పేరుగాంచింది.. దేశంలోని మంచి మైదానాల్లో దీనికి ఒకటిగా చెబుతారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 8:00 PM IST
చిన్నస్వామి దుర్ఘటన.. దేశ చరిత్రలో అతిపెద్ద క్రీడా విషాదం అదే
X

కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి మైదానం ఎంతో పేరుగాంచింది.. దేశంలోని మంచి మైదానాల్లో దీనికి ఒకటిగా చెబుతారు. టీమ్ ఇండియాకు కూడా ఇక్కడ ఎన్నో మధుర అనుభూతులు ఉన్నాయి. అలాంటి స్టేడియం భారత క్రీడా చరిత్రలో పెద్ద విషాదానికి వేదికైంది. 18వ సీజన్ ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ ను గెలుచుకున్న తమ జట్టును చూసేందుకు అభిమానులు పోటెత్తడం పెద్ద తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. 11 మంది ప్రాణాలు బలిగొంది.

అయితే, దేశ చరిత్రలో ఇలాంటి క్రీడా సంబంధిత విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.

45ఏళ్ల కిందటే..

కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి మైదానం కంటే ప్రసిద్ధి చెందినది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్. దీనికీ దశాబ్దాల చరిత్ర ఉంది. టీమ్ ఇండియా ఎన్నో గొప్ప విజయాలు సాధించింది కూడా. అలాంటి ఈడెన్ గార్డెన్స్ లో 1980 ఆగస్టు 16న 16 మంది అభిమానులు చనిపోయారు. అయితే, అప్పుడడు క్రికెట్ మ్యాచ్ కోసం కాదు. బెంగాల్ లో క్రికెట్ ను మించి పాపులర్ అయిన ఫుట్ బాల్ మ్యాచ్ కోసం. ప్రఖ్యాత మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా అభిమానులు ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకోవడం, దాడులతో 16 మంది చనిపోయారు. వందల మంది గాయాలపాలయ్యారు.

-1969లో ఈడెన్‌ గార్డెన్స్‌ బయట మరో విషాదం.. ఈసారి క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కావడం గమనార్హం. అప్పట్లోనే భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ అంటే క్రేజ్ ఉండేది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాటకు దారితీసింది. ఆరుగురు చనిపోయారు. వందమందిపైగా గాయపడ్డారు.

మన హైదరాబాద్ లోనూ..

మూడేళ్ల కిందట.. అంటే 2022లో హైదరాబాద్‌ జింఖానా మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. లక్కీగా.. ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు పోలీసులు, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా బెంగళూరులో మాత్రం 11 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. 50 మందికిపైగా గాయపడడం కలచివేస్తోంది.

బెంగళూరు చిన్నస్వామి మైదానం సామర్థ్యమే 35 వేలు. కానీ, బుధవారం నాడు స్టేడియం బయట 3 లక్షల మంది పోగవడం గమనార్హం.