Begin typing your search above and press return to search.

భారత్ విజయానికి విలన్ అతడే.. అప్పుడు.. ఇప్పుడూ!

కోటి ఆశలతో నూట నలభై కోట్ల మంది అకాంక్షల్ని దారుణంగా దెబ్బ తీసి.. ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ను తన్నుకు పోయారు కంగూరులు

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:32 AM GMT
భారత్ విజయానికి విలన్ అతడే.. అప్పుడు.. ఇప్పుడూ!
X

కోటి ఆశలతో నూట నలభై కోట్ల మంది అకాంక్షల్ని దారుణంగా దెబ్బ తీసి.. ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ను తన్నుకు పోయారు కంగూరులు. ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అద్భుతమైన విజయాన్ని సాధించి.. టీమిండియా వైఫల్యాల్ని పోగుపోసినట్లుగా అందరికి కనిపించేలా చేసినోడు మాత్రం ఒక్కడే. అతడే కానీ.. ఆసీస్ జట్టుకు అండగా నిలవకుంటే ఆ జట్టు గెలిచే అవకాశం తక్కువ. షాకింగ్ నిజం ఏమంటే.. ఇతడే ప్రపంచకప్ టెస్టు టోర్నీని అందుకునే విషయంలోనూ టీమిండియా పాలిట విలన్ గా నిలిచాడు. అతడే.. ఆసీస్ జట్టు సభ్యుడు ట్రావిస్ హెడ్.

తాజా ప్రపంచకప్ టోర్నీని.. గతంలో జరిగిన ప్రపంచ టెస్టు కప్ టోర్నీని అందుకునే విషయంలో అడ్డుగా నిలిచి.. ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించటంలో కీలకభూమిక పోషించాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చేయి విరిగిన అతడు.. ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక అవుతాడా? అన్నదే అనుమానంగా ఉండేది. అలాంటిది ఏకంగా జట్టును విజయతీరాలకు తీసుకెళ్లటమే కాదు.. ఆసీస్ కెప్టెన్ చేత ప్రపంచకప్ టోర్నీని సగర్వంగా అందుకునేలా చేశాడు.

అప్పట్లో ఎలానంటే..

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో ఆట భారత్ పక్షాన నిలిచినట్లుగా కనిపించింది. కానీ.. ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్.. తోటి జట్టు సభ్యుడు స్మిత్ తో కలిసి క్రీజులో పాతుకుపోయాడు. భారత బౌలర్లు ఒత్తిడికి గురి చేసినా అతను తడబడలేదు. ఓవర్లకు ఓవర్లు పాడు కాకుండా ఓపిగ్గా ఆడుతూ.. అవకాశం వచ్చిన ప్రతిసారీ బంతిని బౌండరీకి తరలిస్తూ 93.6 శాతం స్ట్రైక్ రేటుతో ఏకంగా 163 పరుగులు చేసి.. జట్టు భారీ స్కోర్ ను అందించటంలో సాయం చేశాడు. ఈ కారణంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 469 పరుగులకు చేర్చాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 444 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారీ స్కోర్ తో నాడు ప్రపంచకప్ టెస్టు టోర్నీ అందుకోకుండా ఉండటంలో హెడ్ కీలక పోషించాడు.

తాజా మ్యాచ్ లో..

తాజా మ్యాచ్ లోనూ హెడ్ భారత గెలుపునకు అడ్డుగా నిలిచాడు. తొలి బంతినే నాలుగు పరుగులకు తరలించిన ఆసీస్ బ్యాటర్ల దూకుడుకు టీమిండియా బౌలర్లు చకచకా రెండు వికెట్లు తీసినప్పటికి.. ఓపెనర్ గా వచ్చిన హెడ్.. తన వికెట్ ను చేజార్చుకోకుండా జట్టుకు అండగా నిలిచాడు. మూడు వికెట్ల తర్వాత మళ్లీ వికెట్ పడకుండా అడ్డుకున్న అతగాడి పుణ్యమా అని.. ఆసీస్ విజయాన్ని సులువు చేశాడు. వికెట్ కు అవకాశం ఇవ్వకుండా హెడ్ ఒకపక్క.. మరోపక్క లబుషేన్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. జట్టు గెలుపులో కీలకభూమికపోషించాడు. ఇలా రెండు కీలక టోర్నీ ఫైనల్ పోరులో భారత్ పాలిట విలన్ గా నిలిచిన ఈ ఆటగాడు..నూట నలభై కోట్ల మంది ఆవేదనకు బాధ్యుడిగా నిలిచాడని చెప్పక తప్పదు.