Begin typing your search above and press return to search.

వార్ వన్ సైడ్ అంతే.. ఆస్ట్రేలియా అమ్మాయిలు ఆడేసుకున్నారు..

పాపం ఇంగ్లండ్..! మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఏదో గట్టిగా పోరాడుదాం.. చరిత్ర సృష్టిద్దాం అని లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టారు.

By:  A.N.Kumar   |   6 July 2026 10:19 AM IST
వార్ వన్ సైడ్ అంతే.. ఆస్ట్రేలియా అమ్మాయిలు ఆడేసుకున్నారు..
X

పాపం ఇంగ్లండ్..! మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఏదో గట్టిగా పోరాడుదాం.. చరిత్ర సృష్టిద్దాం అని లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టారు. కానీ అక్కడ ఉన్నది ‘కంగారూలు’ అని మర్చిపోయారు. క్రికెట్ ప్రపంచంలో పురుషులైనా, మహిళలైనా ఆస్ట్రేలియాకు ఫైనల్ మ్యాచ్ అంటే అది కేవలం ఒక 'ఫార్మాలిటీ' మాత్రమేనని మరోసారి నిరూపించారు. ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఏడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని తమతో పాటు విమానం ఎక్కించుకుపోయారు ఆస్ట్రేలియా అమ్మాయిలు. మ్యాచ్ చూసిన వాళ్లెవరికైనా ఇది ఫైనల్ మ్యాచ్‌లా కాకుండా.. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌లా అనిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు!

ఇంగ్లండ్ లైనప్.. ఆరంభంలోనే డీలా!

టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆస్ట్రేలియా కెప్టెన్ వ్యూహం మొదటి ఓవర్ నుంచే పారింది. హోమ్ గ్రౌండ్ కదా అని రెచ్చిపోదామనుకున్న ఇంగ్లండ్ ఓపెనర్లు అమీ జోన్స్ (6), డానీ వ్యాట్ (8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ దారి పట్టారు. అలీస్ క్యాప్సీ (23) కొద్దిసేపు బ్యాట్ తిప్పినా, హెదర్ నైట్ (2) అస్సలు నైట్ స్టే చేయడానికి ఇష్టపడలేదు. 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ దశలో కెప్టెన్ నాట్ సీవర్ (58 నాటౌట్), ఫ్రేయా కెంప్ (44) కాస్త పరువు కాపాడే ప్రయత్నం చేశారు. "మేము మరీ అంత తక్కువకి ఆలౌట్ అవ్వం" అంటూ పోరాడి స్కోరును 20 ఓవర్లలో 150 పరుగులకు చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లు కిమ్ గార్త్, లూసీ, మోలన్యూ, అనాబెల్ సదర్లాండ్ తలో వికెట్ పడేసి, "చాల్లేండి, మీరు చేసిన ఈ పరుగులు మా బ్యాటర్లకు స్నాక్స్ లాంటివి" అన్నట్లు వికెట్లను పంచుకున్నారు.

టార్గెట్ 151.. ఆసీస్ అమ్మాయిలకు ఇది ‘చిటికెలో పని’!

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ జార్జియా వోల్ (9) అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్‌కు ఏదో ఆశ చిగురించింది. కానీ అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. బెత్ మూనీ, ఫోబి లిచ్‌ఫీల్డ్ కలిసి ఇంగ్లండ్ బౌలర్లను లార్డ్స్ మైదానం నలుమూలలా పరిగెత్తించారు. బౌలింగ్ వేస్తున్నారా లేక ఫోర్లు కొట్టించుకోవడానికి వచ్చారా అనేలా సాగింది వీరి బ్యాటింగ్.

ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 100 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. లిచ్‌ఫీల్డ్ 48 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నా, బెత్ మూనీ (64) మాత్రం ఇంగ్లండ్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను గుంజేసింది. చివర్లో ఎలీస్ పెర్రీ, ఆష్లీ గార్డ్‌నర్ వచ్చి మిగిలిన ఫార్మాలిటీని పూర్తి చేసి, కేవలం 17.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు.

అవార్డులన్నీ ఆమె ఖాతాలోనే..!

ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ ప్రదర్శన చూస్తే ప్రత్యర్థి జట్లకు ఏడుపొక్కటే తక్కువైంది. ఫైనల్లో 64 పరుగులతో మెరిసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కొట్టేసిన మూనీ, టోర్నీ మొత్తం మీద 238 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' కూడా తానే పట్టుకెళ్లింది. "అవార్డులన్నీ మీరే పట్టుకుపోతే మేమెందుకు ఆడాలి?" అని మిగతా జట్లు లోలోపల అనుకున్నా ఆశ్చర్యం లేదు.

రన్నరప్ 'సెంటిమెంట్' మార్చుకోని ఇంగ్లండ్!

పాపం ఇంగ్లండ్ ఐదోసారి ఫైనల్‌కు చేరినా, అందులో నాలుగోసారి ఆస్ట్రేలియా చేతిలోనే దారుణంగా దెబ్బతిని 'రన్నరప్' ట్రోఫీతో సరిపెట్టుకుంది. "ఫైనల్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. కప్పు మాత్రం మాదే" అన్నట్లుగా ఉంది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు తీరు. అనిశ్చితికి మారుపేరైన టీ20 ఫార్మాట్‌లో ఏకంగా ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం అంటే, అది కేవలం అదృష్టం కాదు.. ప్రత్యర్థులపై వారు చూపిస్తున్న తిరుగులేని 'దాదాగిరి'! మిగతా జట్లు కేవలం టోర్నమెంట్ ఆడటానికి వస్తే, ఆస్ట్రేలియా మాత్రం ట్రోఫీని కలెక్ట్ చేసుకోవడానికి వస్తుందని ఈ మ్యాచ్‌తో మరోసారి ప్రూవ్ అయిపోయింది.