ఐపీఎల్ 2027కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియన్ దిగ్గజాలంతా దూరం
2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ కీలక బౌలర్ల పనిభారాన్ని నియంత్రించాలని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
By: A.N.Kumar | 2 Jun 2026 5:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందే మెగా టోర్నీలో హై-డ్రామా మొదలైంది. ఐపీఎల్ వేలానికి, మ్యాచ్‌లకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఫ్రాంచైజీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఒకటి క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ పేస్ గుర్రాలు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల సమాచారం. 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ కీలక బౌలర్ల పనిభారాన్ని నియంత్రించాలని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
వరల్డ్ కప్ ప్రణాళికలే కారణమా?
2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా ఎలాగైనా కప్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. వరుస అంతర్జాతీయ సిరీస్‌లు, సుదీర్ఘ ప్రయాణాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ ముగ్గురు సీనియర్ పేసర్లకు ఐపీఎల్ సమయంలో విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా గట్టిగా భావిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ ఆడటం వల్ల ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉందని, అందుకే ప్రపంచకప్‌కు ముందు వారిని తాజాగా ఉంచేందుకు బోర్డు ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
మూడు జట్లకు కోలుకోలేని దెబ్బ!
ఈ ఆసీస్ త్రయం ఐపీఎల్‌లో అత్యంత డిమాండ్ ఉన్న విదేశీ ఆటగాళ్లు. వీరు దూరం కావడం ఆయా ఫ్రాంచైజీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా
సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్యాట్ కమిన్స్ కేవలం బౌలర్‌గానే కాకుండా జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. అతడు దూరం కావడం ఎస్ఆర్హెచ్ నాయకత్వ వ్యూహాలకే పెద్ద సవాల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విభాగానికి జోష్ హాజిల్‌వుడ్ ప్రధాన బలంగా ఉన్నాడు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అతడి అనుభవం జట్టుకు ఎంతో కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ కు మిచెల్ స్టార్క్ తన పదునైన యార్కర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగాన్ని శాసిస్తున్నాడు.
మెగా వేలం వ్యూహాలు మారతాయా?
ఒకవేళ ఈ వార్త నిజమైతే ఐపీఎల్ 2027 మెగా వేలానికి వెళ్లే ముందే ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్స్, కొనుగోళ్ల వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే, ప్రత్యామ్నాయ డెత్ ఓవర్ల బౌలర్లను, విదేశీ కెప్టెన్లను వెతుక్కోవడం యాజమాన్యాలకు అంత సులువు కాదు.
అయితే ఇప్పటివరకు క్రికెట్ ఆస్ట్రేలియా కానీ అటు ప్లేయర్లు కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ లోపు ఐపీఎల్ అభిమానులు, ఫ్రాంచైజీలు మాత్రం ఈ ఆసీస్ త్రయం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వీరు తప్పుకుంటే ఈ సీజన్ సరికొత్త సమీకరణాలకు దారితీయడం ఖాయం!
