ఆసియా కప్ ఫైనల్.. భారత్ పక్కా..! రెండో జట్టు అదేనా?
ఆసియా కప్ లో గ్రూప్ దశ ముగిసింది...! సూపర్ 4 శనివారం నుంచి మొదలుకానుంది...! భారత్, పాకిస్థాన్ గ్రూప్ ఎ నుంచి, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూప్ బి నుంచి అర్హత సాధించాయి.
By: Tupaki Desk | 19 Sept 2025 4:32 PM ISTఆసియా కప్ లో గ్రూప్ దశ ముగిసింది...! సూపర్ 4 శనివారం నుంచి మొదలుకానుంది...! భారత్, పాకిస్థాన్ గ్రూప్ ఎ నుంచి, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూప్ బి నుంచి అర్హత సాధించాయి. యూఏఈ చేతిలో ఇటీవల టి20 సిరీస్ ఓడిపోయిన బంగ్లాదేశ్.. అఫ్ఘానిస్థాన్ కంటే పైచేయితో సూపర్-4కు వచ్చింది. శనివారం నుంచి జరిగే ఈ దశ మ్యాచ్ లలో తొలి మ్యాచ్ లో శ్రీలంక-బంగ్లాదేశ్ తలపడనున్నాయి.
ఈ ఆదివారం భారత్ -పాక్ మళ్లీ..
గత ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ ఎంతటి రచ్చకు దారితీసిందో అందరూ చూశారు. ఇప్పటికీ దాని తాలూకు వివాదాలు కొనసాగుతున్నాయి. టీమ్ ఇండియా ఆటగాళ్లు కరచాలనం చేయనందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను పాకిస్థాన్ తప్పుబడుతోంది. అతడిని తప్పించాలని ప్రయత్నించి విఫలమైంది. మళ్లీ ఆదివారం రానే వచ్చింది. ఈసారి మళ్లీ భారత్-పాక్ తలపడనున్నాయి. సూపర్ 4లో ఇది రెండో మ్యాచ్.
బంగ్లాకు వెంటవెంటనే...
సోమవారం (22) మ్యాచ్ లేమీ లేవు. 23న పాకిస్థాన్-శ్రీలంక, 24న భారత్-బంగ్లాదేశ్, 25న పాక్-బంగ్లా మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. అంటే.. బంగ్లా వరుసగా రెండు రోజుల్లో భారత్, పాక్ లతో మ్యాచ్ లు ఆడాల్సి వస్తోంది. ఈ దశలో ఒక్కో జట్టుకు మూడు మ్యాచ్ లు ఉండనున్నాయి. టాప్ 2లో నిలిచినవి ఫైనల్ చేరతాయి.
ఫామ్ ప్రకారం..
ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే.. టీమ్ ఇండియా ఫైనల్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్యం ఏమైనా జరిగితే తప్ప సూపర్ 4లో టాపర్ భారత్ అనే చెప్పాలి. కాదంటే రెండో స్థానంలో అయినా నిలుస్తుంది. మరి ఫైనల్ చేరే రెండో జట్టు ఏదంటే.??
పాక్ కు అవకాశం ఉంటుందా..?
భారత కాకుండా ఆసియా కప్ ఫైనల్ కు చేరే రెండో జట్టు ఏది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకే అని చెప్పాలి. గ్రూప్ బిలో అజేయంగా నిలిచిన ఆ జట్టు సూపర్ 4లోనూ మంచి ప్రదర్శన కనిపించాలని భావిస్తోంది. గతంలో కంటే లంక జట్టు బాగా మెరుగుపడింది. కమిందు మెండిస్ వంటి ఆటగాడే ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు అంటే.. చెప్పొచ్చు లంక ఎంత గట్టిగా ఉందో? దీనికితోడు లంకకు ప్రధాన కోచ్ మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ సనత్ జయసూర్య. సరిగ్గా గత ఏడాది మన గౌతమ్ గంభీర్ కోచ్ అయిన సమయంలోనే జయసూర్య కూడా బాధ్యతలు చేపట్టాడు. తమ జట్టు మెరుగ్గా ఆడేలా చూస్తున్నాడు. కాబట్టి భారత్ తో పాటు లంక ఫైనల్ చేరుతుందని భావింవచ్చు.
-పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు ఫైనల్ కు వచ్చేంతటి సీన్ లేదు. ఈ రెండు జట్లలో ఒక్కటి ఫైనల్ చేరినా అది ఆశ్చర్యమే.
-1984 నుంచి ఇప్పటివరకు 16 ఆసియాకప్ లు జరిగాయి. భారత్ 8 సార్లు, లంక 6 సార్లు కప్ ను నెగ్గాయి. పాక్ రెండుసార్లు విజేతగా నిలిచింది.
