భారత్-పాక్ మ్యాచ్ 10 సెకన్లకు రూ.16 లక్షలు..అంగట్లో దేశభక్తి
ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వద్దనే ఉన్నాయి. వాస్తవానికి భారత్ లోనే నిర్వహించాలి.
By: Tupaki Desk | 18 Aug 2025 9:32 AM ISTకశ్మీర్ పెహల్గాంలో పర్యటకులపై దారుణమైన ఉగ్రదాడి జరిగి సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు.. పాకిస్థాన్ గడ్డ పై ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నాలుగు నెలలకే భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ క్రికెట్ సమరం జరగనుంది..! అసలు అన్ని స్థాయిల్లో సంబంధాల రద్దు అంటూ పొరుగు దేశంపై నిప్పులు కక్కిన దశ నుంచి రెండు దేశాల జట్లు క్రికెట్ మ్యాచ్ ఆడబోతుండడం భారతీయుల్లో చాలామందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇదంతా వచ్చే నెల 9 నుంచి జరుగుతుందని భావిస్తున్న ఆసియా కప్ గురించి. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ కూడా కాదు. అయినా, మన జట్టు పాల్గొనడం సరైనదేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆతిథ్య హక్కులు మనవే..
ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వద్దనే ఉన్నాయి. వాస్తవానికి భారత్ లోనే నిర్వహించాలి. కానీ, పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పెహల్గాం దాడితో పరిస్ధితి మొత్తం మారిపోయింది. పాక్ జట్టు మన దేశానికి వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. మరోవైపు బంగ్లాదేశ్ తోనూ సంబంధాలు సరిగా లేవు. ఈ నేపథ్యంలోనే టోర్నీని దుబాయ్ కి షిఫ్ట్ చేశారు. అక్కడైనా సరే.. పాకిస్థాన్ తో క్రికెట్ ఆడడం ఏమిటని చాలామంది నిలదీస్తున్నారు.
బాయ్ కాట్ చేస్తే..??
ఆసియా కప్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించనునంది. ఐసీసీ టోర్నీ కాదు కాబట్టి దీనిని బహిష్కరించినా ఏమీ కాదు. అసలు ఐసీసీ టోర్నీలో పాల్గొనకున్నా భారత్ ను ఐసీసీ ఏమీ చేయలేదు. ఆర్థికంగా ఆ స్థాయికి చేరింది బీసీసీఐ. అందుకే ఆసియా కప్ ను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. టి20 ఫార్మాట్ లో వచ్చే నెల 9 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి భారత జట్టును రెండు రోజుల్లో ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. అయితే, మన జట్టు ఆడేది లేనిది ఖరారు కావాల్సి ఉంది.
టీవీ + డిజిటల్ కాంబో.. ఇంత రేటా...?
ప్రేక్షకులకు, అభిమానులకు ఉత్కంఠే కాదు.. భారత్ -పాక్ ఎక్కడ ఆడినా అది బ్రాడ్ కాస్టర్లకు కాసుల పంటే. ఆసియా కప్ లో ఈ రెండు జట్ల మ్యాచ్ లో 10 సెకన్లకు టీవీ అడ్వర్టయిజ్మెంట్ల ధర రికార్డు స్థాయిలో రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షలు అని తెలుస్తోంది. ఈ రేట్ కార్డును సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విడుదల చేసింది. 2031 వరకు ప్రసార హక్కులు ఈ సంస్థకే ఉన్నాయి. అంతేకాదు.. స్పాన్సర్‌షిప్‌లు కూడా భారీగానే ఉన్నాయి. కో ప్రజంటేషన్ కోసం రూ.18 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్‌షిప్ నకు రూ.13 కోట్లు, స్పాట్-బై ప్యాకేజీలకు రూ.4.48 కోట్లు అట. ఇక ఆసియా కప్ మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, ఆ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లైవ్‌లో ప్రసారం అవుతాయి. అడ్వర్టయిజ్ మెంట్లను ఆకర్షించడానికి... సోనీ టెలివిజన్ డిజిటల్ ప్రకటనలతో కలిపి గంపగుత్త డీల్ లను అందిస్తోంది.
బాయ్‌కాట్ వర్సెస్ బిగ్ స్పెండింగ్
పెహల్గాం దాడి తదనంతర పరిణామాల్లో పాకిస్థాన్ తో అన్ని సంబంధాలను తెంచుకోవాలని భారతీయుల్లో అత్యధికులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అడ్వర్టయిజ్ మెంట్ల కార్డులను చూస్తే దిమ్మతిరిగిపోతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
