ఆసియా కప్ భారత్-పాక్ ఫైనల్.. ఇలాగైతేనే సాధ్యం... లేదంటే బంగ్లాతో!
టీమ్ ఇండియా బుధవారం దుబాయ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో లంకకు బంగ్లా షాక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 22 Sept 2025 11:00 PM ISTఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఆడాల్సి ఉండే ఆసియా కప్ సూపర్ 4 దశలో రెండు మ్యాచ్ లు ముగిశాయి. తమ తమ తొలి మ్యాచ్ లలో బంగ్లాదేశ్, భారత్ తేలిగ్గా శ్రీలంక, పాకిస్థాన్ పై విజయాలు సాధించాయి. టోర్నీలో సోమవారం విరామం. మంగళవారం నుంచి మొదలయ్యే మ్యాచ్ లలో అబుదాబిలో పాకిస్థాన్- శ్రీలంక ఆడతాయి. ఈ రెండు జట్లలో ఏది ఓడినా ఇక ఫైనల్ ఆశలు గల్లంతే. ఎందుకంటే తొలి మ్యాచ్ లలో ఓడాయి కాబట్టి...!
రేపు ఇంటికెళ్లేదెవరో..?
మంగళవారం మ్యాచ్ లో శ్రీలంక గనుక పాకిస్థాన్ పై నెగ్గితే పాక్ ఇంటికి వెళ్లినట్లే.. చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచినా పెద్దగా ఉపయోగపడుతుందని చెప్పలేం. ఇక ఈ బుధవారం భారత్ గనుక బంగ్లాదేశ్ పై గెలిస్తే దాదాపు ఫైనల్ చేరినట్లే. అంటే... పాకిస్థాన్-శ్రీలంక జట్ల ఆసియా కప్ జర్నీ రేపటితో తేలిపోనుంది.
భారత్ కు బేఫికర్..
టీమ్ ఇండియా బుధవారం దుబాయ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో లంకకు బంగ్లా షాక్ ఇచ్చింది. కానీ, భారత్ ముందు ఆ జట్టు పప్పులు ఉడకవు. అయినప్పటికీ సూర్య కుమార్ యాదవ్ సేన అలర్ట్ గా ఉండడం మంచిది. టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా..? ఒకవేళ బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా ఓడినా.. ఈ నెల 26న శ్రీలంకపై గెలిస్తే ఫైనల్ చేరుతుంది.
అబుదాబిలో మంగళవారం శ్రీలంకతో తలపడే పాక్... 25న బంగ్లాదేశ్ తో దుబాయ్ లో ఆడనుంది. ఈ రెండూ గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. వీటి మధ్యలోనే 24వ తేదీన భారత్-బంగ్లా మ్యాచ్ ఉంది. వీటిలో ఏది గెలిచినా ముందుగానే ఫైనల్ బెర్తు ఖాయం అవుతుంది.
ఈ నెల 28న భారత్ -పాక్ ఫైనల్ చూడాలంటే.. అది పాకిస్థాన్ ఆడే తీరును బట్టి ఉంటుంది. ఒకవేళ పాక్ సూపర్ 4లో ఓడిపోతే బహుశా బంగ్లాదేశ్ కు ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే శ్రీలంక తో తలపడే చాన్సుంది. ఏది ఏమైనదీ మంగళవారంతో తేలిపోనుంది.
