ఆసియా కప్.. కెప్టెన్ కు చోటు లేదు ఇంగ్లండ్ టూర్ హీరోలకు బిగ్ షాక్
దీనికి సంబంధించి నేడో, రేపో జట్టును ఎంపిక చేయనుంది. అయితే, ఇంగ్లండ్ టూర్ లో టాపర్ లుగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Aug 2025 3:06 PM ISTవచ్చే నెల 9 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా పాల్గొనడం ఖాయమే అని తెలుస్తోంది. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ తో ఎలాంటి క్రికెట్ ఆడేది లేదని చెప్పిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంతలోనే మొత్తబడింది. విమర్శలు ఎలా ఉన్నా ఆసియా కప్ కు జట్టును పంపేందుకే బీసీసీఐ సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి నేడో, రేపో జట్టును ఎంపిక చేయనుంది. అయితే, ఇంగ్లండ్ టూర్ లో టాపర్ లుగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్ కు చోటు లేదు
ఆసియా కప్ టి20 ఫార్మాట్ లో జరగనుంది. ఈ ఫార్మాట్ లో టీమ్ ఇండియా కెప్టెన్ గా 360 డిగ్రీ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్న సంగతి తెలిసిందే. అంటే..ఇటీవలి ఇంగ్లండ్ టూర్ లో టెస్టు సిరీస్ ను సమం చేసిన కెప్టెన్ గిల్ కు కెప్టెన్సీ దక్కనట్లే. ఇక ఇంగ్లండ్ టూర్ లో అత్యధికంగా 755 పరుగులు చేసింది గిల్ కావడం గమనార్హం. ఇదే టూర్ లో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు తీశాడు. కానీ, ఈ ఇద్దరికీ ఆసియా కప్ జట్టులో చోటు లేదని తెలుస్తోంది.
కూర్పులో సరిపోకనే...
గిల్ ను బ్యాట్స్ మన్ గా ఆసియా కప్ కు తీసుకునే అవకాశాలు ఉన్నా... కూర్పు సరిపోవడం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వన్ డౌన్ లో కెప్టెన్ సూర్య లేదా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఇలా బ్యాటింగ్ ఆర్డర్ ఫుల్ ప్యాక్డ్. బౌలింగ్ విషయానికి వస్తే స్టార్ పేసర్ బుమ్రా ఫిట్ గా ఉంటే జట్టులో చోటు ఖాయం. అర్షదీప్ సింగ్ ఎలాగూ ఉంటాడు. ఐపీఎల్ టాపర్ ప్రసిద్ధ్ క్రిష్ణ ఖాయం. దీంతో హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు చోటు దక్కడం లేదు.
వీళ్లద్దరే కాదు... వీరికి కూడా
సిరాజ్, గిల్ కే కాదు.. ఓపెనర్ జైశ్వాల్, ఐపీఎల్ టాపర్ సాయి సుదర్శన్ కూ ఆసియా కప్ జట్టులో చోటు లేనట్లే. ఈ టోర్నీ ముగిశాక స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టులు ఆడాల్సి ఉంది. అందుకని కూడా ఈ నలుగురికీ ఆసియా కప్ బెర్తు లేనట్టే. అసలు సిరాజ్ ను టి20లకు పరిగణించడం లేదని సమాచారం. మొత్తానికి ఇంగ్లండ్ లో వీరోచితంగా ఆడి సిరీస్ ను సమం చేసిన జట్టులోని ఆటగాళ్లు ఆసియా కప్ లో ఆడబోవడం లేదంటే ఆశ్చర్యమే.
