వైస్ కెప్టెన్ గిల్... ఆసియా కప్ నకు టీమ్ ఇండియా ఇదే...
ఆసియా కప్ లో పాల్గొనే టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కొన్ని చిన్నపాటి సంచలనాలున్నాయి.
By: Tupaki Desk | 19 Aug 2025 3:17 PM ISTఆసియా కప్ లో పాల్గొనే టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కొన్ని చిన్నపాటి సంచలనాలున్నాయి. కెప్టెన్ గా 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కే పగ్గాలు అప్పగించారు. అయితే వైస్ కెప్టెన్సీని మాత్రం అక్షర్ పటేల్ నుంచి తొలగించారు. ఇతడికి ముందు వైస్ కెప్టెన్ గా వ్యహరించిన హార్దిక్ పాండ్యానూ కాదని.. కొత్త వైస్ కెప్టెన్ ను నియమించారు.
అయ్యర్ కు చోటు లేదు...
ఆసియా కప్ వచ్చే నెల 9 నుంచి జరగనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. టి20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీకి జితేశ్ శర్మను బ్యాకప్ కీపర్ గా ఎంచుకోవడం తప్ప
కొత్త ముఖాలు ఏవీ లేవు. అయితే, మేటి పేసర్ బుమ్రా తిరిగి వచ్చాడు. అతడికి తోడుగా అర్షదీప్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. ఐపీఎల్ టాప్ వికెట్ టేకర్, ఇంగ్లండ్ టూర్ లోనూ పర్యటించిన ప్రసిద్ధ్ క్రిష్ణను, ఇంగ్లండ్ లో టాప్ వికెట్ టేకర్ అయిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్ నూ తీసుకోలేదు.
గిల్ ఖాయం.. తుది జట్టులో ఎవరు?
టెస్టు జట్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను ఆసియా కప్ టి20 జట్టు వైస్ కెప్టెన్ గా నియమించారు. అక్షర్, హార్దిక్ లను కాదని గిల్ ను వైస్ కెప్టెన్ చేశారు. నిరుడు జింబాబ్వే పర్యటనలో గిల్ టి20 జట్టు కెప్టెన్ కావడం గమనార్హం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మలు బ్యాటింగ్ మూలస్తంభాలుగా ఉండనున్నారు. ఆల్ రౌండర్ శివమ్ దూబె, ఫినిషర్ రింకూ సింగ్ లకు చోటు దక్కింది.
కూర్పు ఎలా?
వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా గిల్ ను తుది జట్టులో తప్పక ఆడించాల్సి ఉంటుంది. దీంతో అతడు సంజూ లేదా అభిషేక్ శర్మ తర్వాత వన్ డౌన్ లో ఆడతాడని భావించాలి. ఓపెనర్ గా ఆడిస్తే సంజూను మిడిలార్డర్ కు పంపాల్సి ఉంటుంది. తిలక్, కెప్టెన్ సూర్య, హార్దిక్, దూబెలతో పాటు బుమ్రా, అర్షదీప్, వరుణ్, అక్షర్ లకు తుదిజట్టులో చోటు దక్కొచ్చు. రింకూ, కుల్దీప్, జితేశ్, హర్షిత్ బెంచ్ కే పరిమితం అవుతారని అనుకోవాలి.
