Begin typing your search above and press return to search.

భార‌త్-పాక్..: 8 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్.. ఆసియా క‌ప్ లో మాత్రం తొలిసారి

గురువారం ఆసియా క‌ప్ సూప‌ర్ -4లో సెమీ ఫైన‌ల్ గా భావించిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ గెలిచి ఫైన‌ల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో బంగ్లా గెలిచి ఉంటే అదే ఫైన‌ల్ కు వ‌చ్చేంది.

By:  Tupaki Desk   |   26 Sept 2025 9:20 AM IST
భార‌త్-పాక్..: 8 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్.. ఆసియా క‌ప్ లో మాత్రం తొలిసారి
X

అనేక విమ‌ర్శ‌లతో స్టార్ట‌యి... వివాదాలతో సాగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్లో పోటీ ప‌డేదెవ‌రో తేలిపోయింది..! టీమ్ ఇండియా వ‌చ్చే ఆదివారం జ‌రిగే ఫైన‌ల్లో పాకిస్థాన్ తో త‌ల‌ప‌డుతుంది. దీంతో ఒకే టోర్నీలో మూడుసార్లు పాక్ తో ఆడినట్లు అవుతుంది. మ‌రోవైపు ఆసియా లో పెద్ద జ‌ట్ల‌యిన ఈ రెండూ ఆసియా క‌ప్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌డం మాత్రం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

బంగ్లా అనుకుంటే..

గురువారం ఆసియా క‌ప్ సూప‌ర్ -4లో సెమీ ఫైన‌ల్ గా భావించిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ గెలిచి ఫైన‌ల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో బంగ్లా గెలిచి ఉంటే అదే ఫైన‌ల్ కు వ‌చ్చేంది. ఇక టీమ్ ఇండియా ఇప్ప‌టికే పాక్, బంగ్లాను ఓడించి ఫైన‌ల్ బెర్తును ఖాయం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం చివ‌రి మ్యాచ్ లో శ్రీలంక‌తో ఆడ‌నుంది. గురువారం మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలుత పాకిస్థాన్ పై పైచేయి సాధించిన‌ట్లే క‌నిపించింది. పాక్ మొద‌ట బ్యాటింగ్ కు దిగి 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. మొహ‌మ్మ‌ద్ 31 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బంగ్లా స్వ‌ల్ప టార్గెట్ ను ఛేదించ‌లేక‌పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 11 ప‌రుగుల తేడాతో ఓడింది.

-లీగ్ ద‌శ‌లో వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు గెలిచిన శ్రీలంక సూప‌ర్-4 వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు ఓడిపోయి ఫైన‌ల్ రేసు నుంచి దాదాపు ఔట్ అయింది.

ఎన్నాళ్లో వేచిన ఫైన‌ల్...

భార‌త్ -పాకిస్థాన్ ఎక్క‌డ క్రికెట్ ఆడినా పెద్ద సంచ‌ల‌న‌మే. అయితే, పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో ఆసియా క‌ప్ మ‌రింత వేడెక్కింది. దీనిని ఇంకాస్త పెంచుతూ టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ టాస్ స‌మ‌యంలో పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఆఘాకు, మ్యాచ్ ముగిశాక ఆట‌గాళ్లు ఎవ‌రూ షేక్ హ్యాండ్ లు ఇవ్వ‌కుండా ఆ జ‌ట్టును మాన‌సికంగా దెబ్బకొట్టారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లోనూ చిత్తుగా ఓడించారు. ఈ మ‌ధ్య‌లోనే రిఫ‌రీ విష‌యంలో పాకిస్థాన్ కొర్రీలు పెట్టింది. అవ‌న్నీ తేలిపోగా ఇప్పుడు ఫైన‌ల్ ఆడాల్సి వ‌స్తోంది.

-2017లో చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్-పాక్ త‌ల‌ప‌డ్డాయి. నాడు లీగ్ ద‌శ‌లో పాక్ చిత్తుచేసిన భార‌త్ అనూహ్యంగా ఫైన‌ల్లో త‌డ‌బ‌డింది. క‌ప్ చేజారింది. 2007 టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్ లో పాక్ ను ఓడించింది. 2017 చాంపియ‌న్స్ ట్రోఫీని క‌లుపుకొంటే ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు జ‌ట్లు ఐసీసీ టోర్నీల్లో రెండుసార్లు ఫైన‌ల్లో ఆడాయి. 8 ఏళ్ల‌కు మ‌ళ్లీ ఫైన‌ల్ ఆడ‌నున్నాయి. ఆసియా క‌ప్ లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఫైన‌ల్లో ఎదురుప‌డలేదు.

-1984లో మొద‌లైన ఆసియా క‌ప్ లో టీమ్ ఇండియా 1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018, 2023లో విజేత‌గా నిలిచింది. శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014, 2022లో టైటిల్ కొట్టింది. పాకిస్థాన్ 2000, 2012లో క‌ప్ సాధించింది. మొత్త‌మ్మీద ఇది 17వ ఆసియా క‌ప్. టీమ్ ఇండియా 8, లంక 6, పాక్ 2 సార్లు టైటిల్ నెగ్గాయి.

-పాకిస్ధాన్ 2000లో శ్రీలంక‌ను, 2012లో బంగ్లాదేశ్ ను ఓడించి ఆసియా క‌ప్ గెలిచింది. భార‌త్, పాక్, లంక కాకుండా ఆసియా క‌ప్ లో ఫైన‌ల్ చేరిన జ‌ట్టు బంగ్లాదేశ్ (2012).