Begin typing your search above and press return to search.

మెస్సీ కోసం అర్జెంటీనాను గెలిపించారా? 'ఫిఫా వరల్డ్‌కప్ ఫిక్స్' అంటూ ఈజిప్ట్ సంచలన ఆరోపణలు!

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ప్రిక్వార్టర్‌ పోరు తీవ్ర వివాదానికి దారితీసింది.

By:  A.N.Kumar   |   8 July 2026 2:47 PM IST
మెస్సీ కోసం అర్జెంటీనాను గెలిపించారా? ఫిఫా వరల్డ్‌కప్ ఫిక్స్ అంటూ ఈజిప్ట్ సంచలన ఆరోపణలు!
X

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ప్రిక్వార్టర్‌ పోరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్ట్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, మ్యాచ్‌ ఫలితంపై ఈజిప్ట్‌ ఆటగాళ్లు, కోచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిఫరీ నిర్ణయాలు పూర్తిగా అర్జెంటీనాకు, లియోనల్ మెస్సీకి అనుకూలంగా ఉన్నాయని.. అసలు ఈ ప్రపంచకప్‌ ముందే ఫిక్స్‌ అయినట్లు అనిపిస్తోందని ఈజిప్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మోస్తాఫా జికో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్‌లో పెను దుమారం రేపుతున్నాయి.

2-0 ఆధిక్యం నుంచి ఓటమి వైపు.. ఏం జరిగింది?

ఈ మ్యాచ్‌లో ఒక దశలో ఈజిప్ట్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా రెండు గోల్స్ చేసి 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్థంలో అర్జెంటీనా అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు గోల్స్‌ నమోదు చేసి మ్యాచ్‌ను 3-2తో తన ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ 59వ నిమిషంలో ఈజిప్ట్‌ ఆటగాడు మోస్తాఫా జికో సాధించిన ఒక గోల్‌ను రిఫరీ ఫౌల్‌గా ప్రకటించడం మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది. ఈ నిర్ణయంపై ఈజిప్ట్‌ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు తమకు లభించాల్సిన స్పష్టమైన పెనాల్టీని కూడా రిఫరీ తిరస్కరించాడని ఆరోపించింది.

"మెస్సీ కోసమే ఇదంతా.." ఈజిప్ట్ కోచ్ ఆగ్రహం

ఈ ఘోర పరాజయం అనంతరం ఈజిప్ట్ కోచ్ హోస్సమ్ మీడియాతో మాట్లాడుతూ నిర్వాహకులపై, రిఫరీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "మైదానంలో మేమే మెరుగ్గా ఆడాం. కానీ ఫలితం మాత్రం మాకు దక్కలేదు. ఆట కంటే బాహ్య అంశాలే మ్యాచ్‌ను ప్రభావితం చేశాయి. నిర్వాహకులు మెస్సీని ప్రపంచకప్‌లో మరింత ముందుకు తీసుకెళ్లాలని ముందే ఫిక్స్ అయినట్లు కనిపించింది. అందుకే అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. వీడియో అసిస్టెంట్ రిఫరీ కూడా కీలక సందర్భాల్లో సరైన పరిశీలన చేయలేదు. మా గోల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఫౌల్‌గా ప్రకటించారు. మాకు ఇది ఏమాత్రం ఫెయిర్ ప్లేలా అనిపించలేదు" అని హోస్సమ్ ఆరోపించారు.

'కప్ వారికే ఇచ్చేయండి' : మోస్తాఫా జికో అసహనం

ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మోస్తాఫా జికో కూడా మ్యాచ్‌ అనంతరం తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. రిఫరీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "రిఫరీ మాకు ఘోరమైన అన్యాయం చేశాడు. దేవుడు మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా.. రిఫరీ వాటన్నింటినీ అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే అతని తీరు మాకు వ్యతిరేకంగా ఉంది. 2-0తో మేము గెలవాల్సిన మ్యాచ్‌ను రిఫరీ నిర్ణయాలు పూర్తిగా మార్చేశాయి. ఈ ప్రపంచకప్‌ ముందే ఫిక్స్‌ అయినట్లు అనిపిస్తోంది. ఎలాగూ అర్జెంటీనానే కప్‌ గెలుస్తుంది కాబట్టి, నేరుగా వారికే ట్రోఫీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా" అంటూ జికో వ్యంగ్యంగా మాట్లాడాడు.

సోషల్ మీడియాలో రెండుగా చీలిన ఫుట్‌బాల్ ప్రపంచం

జికో, ఈజిప్ట్ కోచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. దీనిపై ఫుట్‌బాల్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈజిప్ట్‌కు అన్యాయం జరిగిందని, మెస్సీ బ్రాండ్ వాల్యూ కోసమే ఫిఫా ఇలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తోందని మండిపడుతుండగా.. మరికొందరు మాత్రం రిఫరీ నిర్ణయాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని, అర్జెంటీనా తమ ప్రతిభతోనే గెలిచిందని వాదిస్తున్నారు.

మౌనంలో ఫిఫా..

ఈ సంచలన ఫిక్సింగ్ ఆరోపణలపై ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య ఫిఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఒకవైపు ఈ రిఫరీ నిర్ణయాలపై వివాదం ముదురుతుండగా.. అర్జెంటీనా మాత్రం క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించి టైటిల్‌ వేటలో ముందంజలో ఉంది. అయితే ఈజిప్ట్‌ చేసిన ఆరోపణలు ప్రపంచ ఫుట్‌బాల్‌లో సరికొత్త చర్చకు తెరతీశాయి. మరి ఈ తీవ్ర ఆరోపణలపై ఫిఫా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.