Begin typing your search above and press return to search.

అండర్-19 వరల్డ్ కప్ లో తెలుగోడు.. తల్లిదండ్రుల త్యాగ ఫలితం

క్రికెట్ లో ఎన్నో ఏజ్ గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది అండర్ -19 అని కచ్చితంగా చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   21 Jan 2024 11:30 PM GMT
అండర్-19 వరల్డ్ కప్ లో తెలుగోడు.. తల్లిదండ్రుల త్యాగ ఫలితం
X

క్రికెట్ లో ఎన్నో ఏజ్ గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది అండర్ -19 అని కచ్చితంగా చెప్పుకోవాలి. ఈ స్థాయి క్రికెట్ లో రాణించిన విరాట్ కోహ్లి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మనందరం చూస్తున్నాం. ఇక శిఖర్ ధావన్, అంబటి రాయుడు, శుబ్ మన్ గిల్ వంటి స్టార్లంతా అండర్ -19 నుంచి వచ్చినవారే. ఇప్పుడు వీరి జాబితాలో చేరాడు తెలుగు కుర్రాడు ఆరవెల్లి అవనీష్. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ లో అవనీష్ భారత్ తరఫున ఆడుతున్నాడు.

సిరిసిల్ల నుంచి అమెరికా టు ఇండియా

అవనీష్ కుటుంబానిది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం అమెరికాకు వెళ్లింది. అక్కడ మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ అవనీష్ తండ్రి సొంతగడ్డపై ప్రేమతో ఇండియాకు తిరిగొచ్చారు. అంతేకాదు.. క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఆయనకు. దీంతో కుమారుడిని విపరీతంగా ప్రోత్సహించారు. తండ్రి అంచనాలను నిలబెడుతూ అవనీష్ ఒక్కో మెట్టు ఎక్కాడు. అండర్ 19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదంతా అంత సులువుగా ఏమీ జరగలేదు. అవనీష్ తండ్రి సొంతంగా వ్యాపారం చేసినా కలిసిరాలేదు. దీంతో మళ్లీ ఉద్యోగ బాట పట్టారు. దీంతో అవనీష్ కోచింగ్ బాధ్యత అతడి తల్లిపై పడింది. రోజూ కోచింగ్ సెంటర్లకు కొడుకును తీసుకెళ్తూ ఆమె చాలా కష్టపడ్డారు. దీనికి ఫలితమే అవనీష్ రాణింపు.

చెన్నై సూపర్ కింగ్స్ కు..

గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆరవెల్లి అవనీష్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. లీగ్ లో అత్యంత విజయవంతమైన చెన్నైకు ఆడడం..అందులోనూ ధోనీ, జడేజా వంటి స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అంటే అవనీష్ కెరీర్ లో ఓ మెట్లు ఎక్కినట్లే. కాగా.. అవనీష్ ఎడమచేతి వాటం బ్యాటర్. పైగా వికెట్ కీపర్ కూడా. మంచి ఎత్తుతో టైమింగ్ తో బలంగా షాట్లు కొట్టడం అతడి ప్రత్యేకత.

మొదటి మ్యాచ్ లోనే ఆకట్టకున్నాడు..

అండర్ -19 ప్రపంచ కప్ లో భాగంగా శనివారం కుర్ర టీమిండియా.. బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో అవనీష్ 17 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్ తో 23 పరుగులు చేశాడు. స్కోరు పెంచే క్రమంలో దూకుడుగా ఆడబోయి ఔటయ్యాడు. అయితే.. ఆరో స్థానంలో దిగిన అవనీష్ కాస్త ఊపునివ్వడంతో టీమిండియా మెరుగైన స్కోరు (251) చేసింది. కాగా, అవనీష్ బ్యాటింగ్ స్టయిల్ చూసినవారు మాత్రం ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. ఈ మాటలు నిజం కావాలని.. అతడి తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కాలని.. టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ స్థాయిలో గొప్ప వికెట్ కీపర్ బ్యాటర్ దొరకాలని అందరమూ కోరుకుందాం.