Begin typing your search above and press return to search.

ఈ లయన్ చాలా స్పెషల్ ..అరుదైన రికార్డుల క్లబ్ లోకి ఎంట్రీ

ఒక విధంగా చెప్పాలంటే వార్న్ శకం ముగిశాక విదేశీ జట్లలో నాణ్యమైన స్పిన్నర్ ఎవరూ అంటే.. అందరూ చెప్పే ఒకే ఒక పేరు అతడు.

By:  Tupaki Desk   |   17 Dec 2023 11:02 AM GMT
ఈ లయన్ చాలా స్పెషల్ ..అరుదైన రికార్డుల క్లబ్ లోకి ఎంట్రీ
X

భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఉప ఖండ క్రికెట్ జట్లలో ఓ స్పిన్ బౌలర్ ప్రతిభ చాటడం గొప్పేమీ కాదు. ఈ దేశాల్లో ఎక్కువ శాతం పిచ్ లు స్పిన్ కు అనుకూలించేవి అయి ఉంటాయి. కొత్తగా పుట్టుకొచ్చే బౌలర్లలో ఎక్కువ శాతం స్పిన్నర్లే అయి ఉంటారు. కానీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో స్పిన్నర్లు తక్కువ. ఒకవేళ ఉన్నప్పటికీ వారు ఎక్కువశాతం నాలుగు ఓవర్లు వేసే పార్ట్ టైమర్లుగానే ఉంటారు. ఈ దేశాల్లో ఒకరిద్దరు మాత్రమే ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు ఉంటారు. షేన్ వార్న్ వంటి అత్యంత ప్రతిభావంతులైతే తప్ప వీరు గొప్పగా ప్రతిభ చాటుతారని ఊహించలేం. ఒక విధంగా చెప్పాలంటే వార్న్ శకం ముగిశాక విదేశీ జట్లలో నాణ్యమైన స్పిన్నర్ ఎవరూ అంటే.. అందరూ చెప్పే ఒకే ఒక పేరు అతడు.

పేసర్ల శకంతో స్పిన్ సంచలనం

ఆస్ట్రేలియాకు దాదాపు 13 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్. ఈ క్రమంలో 123 టెస్టులు ఆడాడు. విదేశాల్లో మరీ ముఖ్యంగా ఉప ఖండంలో లయన్ గతంలో ప్రభావం చూపాడు. కేవలం టెస్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న అతడు.. 29 వన్డేలు మాత్రమే ఆడాడు. 2 టి20ల్లోనే ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. గత నెలలోనే 36 ఏళ్లు దాటిన లయన్ మరో రెండు మూడేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. వార్న్ తర్వాత ఆస్ట్రేలియాకు టెస్టు విజయాలు సాధించి పెట్టిన స్పిన్నర్ గా ఇప్పటికే అతడు చరిత్రలో నిలిచిపోయాడు. స్టార్క్, కమ్మిన్స్, హేజిల్ వుడ్ వంటి పేసర్లు రాజ్యం ఏలుతున్న కాలంలో తనదైన ప్రతిభతో టెస్టుల్లో లయన్ 500 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు.

పాకిస్థాన్ తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో లయన్ 500 వికెట్ల మైలురాయిని చేరాడు. ఈ ఘనత సాధించిన 8వ బౌలర్ లయన్ కావడం విశేషం. శ్రీలంకకు చెందిన మురళీధరన్ (800) టాప్ లో ఉండగా షేన్ వార్న్ (708) తర్వాత స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ (690), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్, 604), ఆస్ట్రేలియా మేటి పేసర్ మెక్ గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (వెస్టిండీస్, 519) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత 8వ ప్లేస్ లో నిలిచాడు లయన్.

అతడి తర్వాత మనోడే..

లయన్ ప్రస్తుతం 501 వికెట్లు పడగొట్టాడు. మరో రెండేళ్లయినా ఆడతాడు. ఈ క్రమంలో 600 వికెట్లు తీయగలడు. కాగా ,లయన్ తర్వాత 500 వికెట్లకు చేరువలో ఉన్నది ఎవరో తెలుసా? టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (489). దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులు ఆడనున్న అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరతాడేమో చూడాలి. లేదంటే కొత్త సంవత్సరంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ లోనైనా రికార్డును అందుకుంటాడు. మరోవైపు 500పైగా వికెట్లు తీసినవారిలో లయన్, అండర్సన్, అశ్విన్ మాత్రమే ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్నారు. ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నవారిలో వీరి తర్వాత ఉన్నది మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా-338) మాత్రమే.