ఆంధ్రా క్రికెట్ కు విదేశీ కోచ్..దేశంలో తొలి అసోసియేషన్ గా రికార్డు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) దేశంలో మరే క్రికెట్ సంఘానికీ సాధ్యం కాని నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 14 Sept 2025 11:10 AM ISTఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) దేశంలో మరే క్రికెట్ సంఘానికీ సాధ్యం కాని నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియాకే ప్రస్తుతం విదేశీ కోచ్ లను నియమించడం లేదు. రాష్ట్ర అసోసియేషన్ అయినప్పటికీ.. ఏసీఏ మాత్రం ఓ విదేశీ కోచ్ ను, నిన్నటివరకు అంతర్జాతీయ జట్టుకు కోచ్ గా పనిచేసిన వ్యక్తిని తీసుకుంది. బహుశా ఇది భారత క్రికెట్ చరిత్రలోనే కీలక నిర్ణయం అనుకోవచ్చేమో..? వచ్చే రంజీ సీజన్ కు అంతర్జాతీయ స్థాయి కోచ్ తో బరిలో దిగనుంది ఆంధ్రా క్రికెట్ జట్టు.
కేన్ మామ కోచ్.. ఇప్పుడు ఆంధ్రా రంజీ జట్టుకు...
భారత క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్ లలో ఒకడు జాన్ రైట్. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా భారత క్రికెట్ అతిపెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో రైట్ బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టును మేటిగా నిలిపేందుకు పునాదులు వేశాడు. అయితే, అది జాతీయ జట్టుకు. ఇప్పుడు ఏసీఏ నియమించుకున్నది రాష్ట్ర జట్టుకు. ఆ కోచ్ పేరు గ్యారీ స్టీడ్. నిన్నటివరకు ఇతడు న్యూజిలాండ్ జాతీయ జట్టు కోచ్ కావడం గమనార్హం. అంటే.. కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజ బ్యాటర్ ఉన్న జట్టుకు కోచ్ గా వ్యవహరించిన వ్యక్తి ఆంధ్రా జట్టుకు కోచ్ గా వస్తున్నట్లు అన్నమాట.
రంజీ జట్టుకు తొలి విదేశీ కోచ్
ఇప్పటివరకు భారత్ క్రికెట్ కు జాన్ రైట్ తో పాటు గ్యారీ కిర్ స్టెన్ (దక్షిణాఫ్రికా) కోచ్ లుగా వ్యవహరించిన విదేశీయులు. అయితే, వారు జాతీయ జట్టుకు పనిచేశారు. స్టీడ్ మాత్రం రంజీ జట్టుకు కోచ్ గా రానుండం విశేషం. ఒక విదేశీ కోచ్ ను నియమించుకున్న తొలి రాష్ట్ర అసోసియేషన్ గా ఏసీఏ నిలిచింది. మరికొద్ది రోజుల్లో మొదలయ్యే 2025-26 రంజీ సీజన్ లో స్టీడ్ ఆంధ్రా జట్టును నడిపించనున్నాడు.
-53 ఏళ్ల స్టీడ్ న్యూజిలాండ్ తరఫున 5 టెస్టులు ఆడాడు. 278 పరుగులు చేశాడు. అయితే, 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 4,984 పరుగులు చేశాడు. అయితే, కోచ్ గా విశేష అనుభవం ఉన్నవాడు. ఇతడి టర్మ్ లోనే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మంచి విజయాలు సాధించింది. ఇందులో.. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ పై నెగ్గి ఫైనల్ చేరడంతో పాటు, భారత్ పై ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ గెలవడం వంటివి ఉన్నాయి.
