Begin typing your search above and press return to search.

ఇదిగిదిగో..ఇంగ్లండ్‌-ఇండియా టెస్టు సిరీస్‌ 'సచిన్‌-అండర్సన్‌' ట్రోఫీ

ఈ రెండు దేశాలకు చెందిన అలెన్‌ బోర్డర్‌-సునీల్‌ గావస్కర్‌ పేర్లు కలిసొచ్చేలా బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)ని రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 10:07 PM IST
ఇదిగిదిగో..ఇంగ్లండ్‌-ఇండియా టెస్టు సిరీస్‌ సచిన్‌-అండర్సన్‌ ట్రోఫీ
X

ఇప్పటివరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్యనే ఇద్దరు క్రికెటర్ల పేరిట సిరీస్‌ జరుగుతోంది. ఈ రెండు దేశాలకు చెందిన అలెన్‌ బోర్డర్‌-సునీల్‌ గావస్కర్‌ పేర్లు కలిసొచ్చేలా బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)ని రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌-జేమ్స్‌ అండర్సన్‌ పేరిట క్రికెట్‌ సిరీస్‌ మొదలుకానుంది. శుక్రవారం నుంచి టీమ్‌ ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌లో జరగబోయే తొలి టెస్టు నుంచి దీనికి అంకురార‍్పణ జరగనుంది. కాగా, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ పూర్తిగా దిగ్గజ బ్యాటర్లు అయిన క్రికెటర్ల పేరిట జరుగుతోంది. ఇంగ్లండ్‌-ఇండియా సిరీస్‌కు మాత్రం బ్యాటింగ్‌ గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌, బౌలింగ్‌ లెజెండ్‌ అండర్సన్‌ పేరు పెట‍్టడం గమనార్హం.

గురువారం ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ (ఈసీబీ) సరికొత్త అండర్సన్‌-సచిన్‌ ట్రోఫీని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. ఇక ట్రోఫీ విషయానికి వస్తే ఈ ఇద్దరి ఫొటోలతో పాటు సంతకాలతో ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌-ఇండియా జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ నవాబ్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ పేరిట ట్రోఫీని బహూకరించేవారు.అయితే, ఈసారి ఆ పేరును అండర్సన్‌-టెండుల్కర్‌ ట్రోఫీగా మార్చారు. దీనిపై సచిన్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. పటౌడీ పేరునే కొనసాగించాలని కోరాడు. చివరకు తన పేరిట జరిగే సిరీస్‌ ట్రోఫీ ఆవిష్కరణకు హాజరయ్యడు. ఇక ఈ సిరీస్‌ పేరు మార్చినా.. పటౌడీ పేరు భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌లో భాగంగా ఉంటుంది. విజేత జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను బహూకరిస్తారు.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 1996లో ప్రారంభమైంది. అంటే దాదాపు 30 ఏళ్ల కిందట. ఆ ఏడాది అలెన్‌ బోర్డర్‌ రిటైర్‌ అయ్యాడు. 156 టెస్టులు ఆడిన బోర్డర్‌ 11174 పరుగులు చేశాడు. 273 వన్డేల్లో 6524 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ (1988లో భారత్‌లో) గెలిచింది బోర్డర్‌ సారథ్యంలోనే. కంగారూలను ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా నిలిపాడు బోర్డర్‌. ఇక మన దేశ బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 125 టెస్టుల్లో 10,122 పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మన్‌ ఇతడే. పేరు వింటేనే భయపడే వెస్టిండీస్‌ బౌలర్లను హెల్మెట్‌ కూడా లేకుండా ఎదుర్కొని వేలాది పరుగులు సాధించాడు.

24 ఏళ్ల కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్‌ టెండూల్కర్‌ 15,921 పరుగులు చేశాడు. 463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. ఏకైక అంతర్జాతీయ టి20లో 10 పరుగులకు ఔటయ్యాడు.టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్‌ పేరిటే ఉంది.

21 ఏళ్ల కెరీర్‌లో 188 టెస్టులు ఆడిన అండర్సన్‌ 704 వికెట్లు సాధించి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 అంతర్జాతీయ టి20ల్లో 18 వికెట్లు సాధించాడు.