అతడి దారి.. రహదారి.. న్యూజిలాండ్ జట్టులో మరో భారత ప్లేయర్
ఇష్ సోథీ.. ఎజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర.. వీరంతా భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెటర్లు. ఆ దేశ జట్టుకు ఆడుతూ మ్యాచ్ విన్నర్లుగానూ నిరూపించుకున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2026 8:30 AM ISTఇష్ సోథీ.. ఎజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర.. వీరంతా భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెటర్లు. ఆ దేశ జట్టుకు ఆడుతూ మ్యాచ్ విన్నర్లుగానూ నిరూపించుకున్నారు. ఇప్పుడు వీరి పక్కనే మరో యువ క్రికెటర్ చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాడు. ఇష్ సోథి పంజాబ్ లో, ఎజాజ్ పటేల్ ముంబైలో, రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది బెంగళూరు కాగా.. ఈ కొత్త కుర్రాడు మాత్రం తమిళ తంబి. తద్వారా భారత దేశంలోని మరో ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ న్యూజిలాండ్ జట్టుకు ఆడనున్న రికార్డును అందుకున్నాడు. అది కూడా త్వరలో భారత్ తో జరిగే సిరీస్ లోనే కావడం విశేషం. న్యూజిలాండ్ జనాభా 60 లక్షల లోపే ఉంటుంది. వీరిలోనే భారత సంతతి ప్రజలు 6 శాతం వరకు ఉన్నారు. దీంతోనే ఆ దేశ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.
ప్రతీకార సిరీస్
2024 చివర్లో భారత్ లో 3 టెస్టుల సిరీస్ ఆడిన న్యూజిలాండ్.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మన జట్టును క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు టెస్టులు ఆడి వెళ్లిపోయిన న్యూజిలాండ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్ కు వస్తోంది. ఈ నెల 11 నుంచి భారత్ తో వన్డే సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు అయిపోయాక 5 టి20ల సిరీస్ జరగనుంది. టి20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టులో యువ స్పిన్నర్ ఆదిత్య అశోక్ చోటు దక్కించుకున్నాడు.
తమిళనాడులో మూలాలు
23 ఏళ్ల ఆదిత్య అశోక్ ది తమిళనాడులోని వేలూరు. వీరి తల్లిదండ్రులు 2007లో న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డారు. అయితే, ఆదిత్య తరచూ స్వదేశానికి వస్తుంటాడు. తాతతో మంచి అనుబంధం ఉన్న అతడు ఆ అనుభూతులను పంచుకుంటుంటాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ డైలాగ్.. నా దారి రహదారి అనే డైలాగ్ ను తమిళంలో చేతిపై టాటూగా వేయించుకున్నాడు ఆదిత్య.
సీఎస్కేలో మెలకువలు నేర్చుకుని..
నిరుడు ఆదిత్యచెన్నై సూపర్ కింగ్స్ అకాడమీలో కొంతకాలం గడిపాడు. అక్కడి పిచ్ లపై బాగా ప్రాక్టీస్ చేశాడు. తన ఆరాధ్య స్పిన్నర్ ఎవరూ అంటే? ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ పేరు చెబుతాడు ఈ తమిళ తంబి. సహచర క్రికెటర్ ఇష్ సోధితో ప్రత్యేక అనుబంధం ఉందని.. అతడు తనకు పెద్దన్న అని వివరిస్తున్నాడు.
