Begin typing your search above and press return to search.

పొట్ట.. జుట్టుతో.. మారు వేషంలో టీమిండియా క్రికెటర్ అంపైరింగ్

అదో చిన్న గ్రౌండ్.. 15-17 ఏళ్ల వయసు కుర్రాళ్లు క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. ఓ వ్యక్తి అంపైరింగ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:51 AM GMT
పొట్ట.. జుట్టుతో.. మారు వేషంలో టీమిండియా క్రికెటర్ అంపైరింగ్
X

అదో చిన్న గ్రౌండ్.. 15-17 ఏళ్ల వయసు కుర్రాళ్లు క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. ఓ వ్యక్తి అంపైరింగ్ చేస్తున్నాడు. పెద్ద పొట్ట.. చింపిరి విగ్గు పెట్టుకున్న పొడవాటి జుట్టుతో అంపైరింగ్ చేస్తున్నాడు.. ఓ వివాదాస్పద ఔట్ కూడా ఇచ్చాడు.. హౌ ఈజ్ ఇట్ అంటూ కుర్రాళ్లు అప్పీల్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. అంపైరింగ్ చేస్తున్న వ్యక్తి వాలకమే కాస్త తేడాగా అనిపించింది. ఈ మ్యాచ్ జరిగింది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అని తెలుస్తోంది. మరి అంపైర్ ను చూస్తే అతడి వస్త్రధారణ చాలా పాష్ గా ఉంది. మరి ఎవరతడు? వారం రోజుల కిందట జరిగినట్లుగా తెలుస్తున్న ఈ ఘటన ఇంతవరకు వెలుగులోకి రాకపోవడం గమనార్హం

ఏపీలో ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని ప్రభుత్వం ప్రతిష్థాత్మకంగా చేపట్టింది. యువతలో క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు ఆడుదాం ఆంధ్రా అని పిలుపునిస్తోంది. కాగా, ఈ పోటీలకు ప్రభుత్వం విశేష ప్రచారమూ కల్పించింది. ఓటు హక్కు న్న యువతకు ఎక్కువగా కనెక్టయ్యే కార్యక్రమం కావడమే దీనికి కారణం. మరోవైపు ఆడుదాం ఆంధ్రాకు విశేష ప్రచారం దక్కేలా ఓ అంతర్జాతీయ క్రికెటర్ ను ఎంచుకోవడం గమనార్హం.

అతడు అక్కడ ఎలా..?

పైన చెప్పుకొన్న క్రికెట్ మ్యాచ్ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆంధ్రాలోనే అని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్ కు అంపైరింగ్ చేసినదెవరో తెలుసా? ఇంకెవరు.. ప్రతిభావంతుడైన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న అంబటి తిరుపతి రాయుడు. జాతీయ, అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నోసార్లు వార్తలు, కథనాల్లో నిలిచిన రాయుడు ప్రస్తుతం సొంత రాష్ట్రం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు ఓ క్రికెట్ మ్యాచ్ కు మారు వేషంలో వెళ్లి అంపైరింగ్ చేశాడు

పూర్తిగా మారు వేషంలో

అంపైర్ గా వెళ్లిన రాయుడిని కనీసం ఎవరూ గుర్తుపట్టలేదు. అతడు అంపైరింగ్ తర్వాత వేషం తీసేసి చెబితే కానీ.. విషయం గుర్తించలేకపోయారు. దీంతో అక్కడి కుర్రాళ్లు తొలుత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అంబటి రాయుడు తమ మ్యాచ్ కు వచ్చాడన్న విషయం తెలిసి డగౌట్ లో ఉన్నవారంతా ఒక్కసారిగా మైదానంలోకి వచ్చారు. కాగా, మీరందరూ ఇదే మైదానంలో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా? అని రాయుడు ప్రశ్నించాడు. అనంతరం క్రికెటర్ గా ఎదగాలంటే ఏం చేయాలో సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఉంది.

కొసమెరుపు: ఆటగాడిగా సంచలనం రేపిన రాయుడు.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. కానీ, అతడు మారువేషంలో వెళ్లి మైదానంలో అంపైరింగ్ చేసిన విషయం వారం రోజులైనా బయటకు రాలేదు. మీడియాకు ఎక్కలేదు. ఎక్కడ మిస్ అయిందో మరి?