టీమ్ ఇండియాకు దొరికాడు మరో షమి... అతడిని జాగ్రత్తగా వాడుకుంటేనే...
ఈ ప్రశ్నకు సమాధానమే ఆకాశ్ దీప్. ఇంగ్లండ్ తో రెండో టెస్టులో ఆకాశ్ ప్రదర్శన చూశాక..షమీ లేని లోటు తీరింది అనిపించింది.
By: Tupaki Desk | 9 July 2025 3:00 AM ISTటీమ్ ఇండియాను ఒంటిచేత్తో టి20లు, వన్డేలు, టెస్టుల్లో ఓడించగల సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి గాయాల బెడద. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి గత 20 నెలల్లో అతడు ఆడింది వేళ్ల మీద లెక్కపెట్టగల మ్యాచ్ లే. ఇప్పుడు గాయం భయంతో ఇంగ్లండ్ తో సిరీస్ కు ఎంపికే చేయలేదు.
ఐదు టెస్టుల సిరీస్ లో అన్ని మ్యాచ్ లు ఆడలేని పరిస్థితి స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాది.. వెన్ను గాయం ఎప్పుడు తిరగబెడుతుందో తెలియక కెప్టెన్సీ కూడా వద్దనుకున్న పరిస్థితి.. మంచి పేస్, రిథమ్ ఉన్నప్పటి హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కొన్ని లోపాలున్నాయి. కొత్త బంతితో ఎంత ప్రమాదకరంగా కనిపిస్తాడో, బంతి పాతబడితే అంతే సాధారణంగా మారిపోతాడు.
ఐపీఎల్ లో రాణించాడు కదా? అని మంచి పేస్ తో పాటు ఎత్తు ఉండి బౌన్స్ కూడా రాబట్టే ప్రసిద్ధ్ క్రిష్ణ విదేశాల్లో తేలిపోతున్నాడు.ఎడమచేతి వాటం అర్షదీప్ సింగ్ వంటి కుర్రాడు ఉన్నప్పటికీ అతడిని టెస్టుల్లోకి తీసుకోవడంలో తటపటాయిస్తున్నారు.
..ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా పేస్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. మరి విదేశాల్లో 20 వికెట్లు తీసి టెస్టులు గెలవాలంటే ఎలా?
ఈ ప్రశ్నకు సమాధానమే ఆకాశ్ దీప్. ఇంగ్లండ్ తో రెండో టెస్టులో ఆకాశ్ ప్రదర్శన చూశాక..షమీ లేని లోటు తీరింది అనిపించింది. షమీని పోలి ఉండే బౌలింగ్ శైలితో కచ్చితత్వంతో వికెట్లు తీస్తున్న ఆకాశ్ దీప్ తనలో మంచి పేసర్ ఉన్నాడని చాటాడు.
ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో రెండు జట్ల మధ్య తేడా ఎవరు? అంటే కెప్టెన్ శుబ్ మన్ గిల్ లేదా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి చెబుతారేమో? కానీ, అసలు సిసలు తేడా ఆకాశ్ దీప్. ఒక టెస్టులో పది వికెట్లు అదీ విదేశీ గడ్డపై సాధించడం అంటే మాటలు కాదు. కానీ, ఆకాశ్ తనదైన బౌలింగ్ తో దానిని సాధించాడు.
బిహార్ లో పుట్టి పశ్చిమ బెంగాల్ కు ఆడుతున్న ఆకాశ్.. దేశవాళీ క్రికెట్ లో కొన్నాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 201 ప్రపంచ కప్ లో ధోనీ సిక్సర్ తో స్ఫూర్తి పొంది, విరాట్ కోహ్లిని ఆరాధిస్తూ వచ్చిన ఆకాశ్.. కష్టాలను ఎదురీది అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆరుగురి సంతానంలో చివరివాడు అయిన అతడు.. 18 ఏళ్ల వయసులోనే తండ్రిని, అన్నను కోల్పోయాడు. ఆర్థిక కష్టాలు వెంటాడినా అక్క అఖండ్ జ్యోతి ఇచ్చిన ప్రోత్సాహంతో ఢిల్లీకి వెళ్లి క్లబ్ క్రికెట్ ఆడాడు.
2017 బెంగాల్ కు వెళ్లి.. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు. కోల్ కతాలో అనేక కష్టాలు అనుభవించి.. టీమ్ ఇండియా మాజీ ఆటగాడు అరుణ్ లాల్, బెంగాల్ మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ, పేసర్ షమీ తదితరుల తోడ్పాటుతో రాటుదేశాడు. 2019లో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి వచ్చాడు. 2021 సీజన్ లో 35 వికెట్లు తీశాడు. అదే ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు క్యాంప్ నకు ఎంపికై కోహ్లి కంటబడ్డాడు. అదే జట్టు తరఫున ఐపీఎల్ ఆడాడు. ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ ఆకాశ్ ను రూ.5 కోట్లకు కొనుక్కుంది. కాగా, ఆకాశ్ దీప్ ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తే టీమ్ ఇండియా మంచి పేసర్ దొరుకుతాడు. మరో ఐదారేళ్లు సేవలందిస్తాడు. ఆ బాధ్యత బీసీసీఐ పైనే ఉంది.
