చిక్కు వీడింది.. కోహ్లి రిటైర్మెంట్ ముందే చెప్పాడు.. అగార్కర్ స్పష్టత
తాజాగా ఇంగ్లండ్ తో సిరీస్ కు కెప్టెన్ కమ్ జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పినదానిని బట్టి కోహ్లి వివాదంలో స్పష్టత వచ్చింది.
By: Tupaki Desk | 25 May 2025 2:00 AM ISTగత ఏడాది జూన్ లో టి20 ప్రపంచ కప్ అనంతరం టి20లకు రిటైర్మెంట్ ఇచ్చిన టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. టెస్టులు మరికొంత కాలం ఆడే ఉద్దేశంలో కనిపించాడు.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో రాణించి.. ఇంకా కొనసాగే ఊపులో కనిపించాడు.. ఈ ఐపీఎల్ లో 500 పైగా పరుగులు కొట్టి ఇంగ్లండ్ తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధం అన్నట్లుగా ఉన్నాడు. కానీ, ఇంతలోనే తాను ఎంతగానో ఇష్టపడే టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఫిట్నెస్, ఫామ్ ఉన్నప్పటికీ.. దేశానికి ఆడాలన్న తపన ఉన్నప్పటికీ అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులోనూ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ తప్పకొన్న కొద్ది రోజులకే కోహ్లి కూడా గుడ్ బై చెప్పడం పలు ఊహాగానాలకు తావిచ్చింది.
టెస్టు కెప్టెన్సీని మూడేళ్ల కిందటే వదిలేసిన అతడు.. రోహిత్ లేనందున మళ్లీ కెప్టెన్సీ కోరాడని, అది సాధ్యం కాదని చెప్పడంతోనే రిటైర్ అయ్యాడని కథనాలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్ తో సిరీస్ కు కెప్టెన్ కమ్ జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పినదానిని బట్టి కోహ్లి వివాదంలో స్పష్టత వచ్చింది.
కోహ్లి ఏప్రిల్ లోనే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు అగార్కర్ తెలిపాడు. అంటే.. భారత్-పాక్ ఉద్రిక్తతలకు ముందే.. ఐపీఎల్ జరుగుతున్నప్పుడే కోహ్లి తన టెస్టు భవిష్యత్ పై ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. కోహ్లి ఏప్రిల్ లో నిర్ణయం తీసుకునేప్పటికి.. రోహిత్ కూడా టెస్టులు ఆడతాను అనే ఉద్దేశంలో కనిపించాడు. తన ఫామ్, ఫిట్ నెస్, టెస్టులకు పనికిరావడం, కెప్టెన్సీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. అప్పటికి రోహిత్ ఇంకా రిటైర్ కావాలని నిర్ణయించుకోలేదు. కానీ, కోహ్లి మాత్రం వైదొలగాలనే భావనకు వచ్చాడట. ఇదే మాటను సెలక్షన్ కమిటీకి కూడా తెలిపాడని అగార్కర్ మాటలను బట్టి అర్థం అవుతోంది. అంతేగాని.. తనకు టెస్టు కెప్టెన్సీ ఇవ్వనందుకే తప్పుకొన్నట్లు వచ్చిన కథనాలు నిజం కావని స్పష్టం అవుతోంది. అయితే, రోహిత్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడంతోనే అసలు సందేహం వచ్చింది. ఇప్పుడు అగార్కర్ చెప్పినదాన్ని బట్టి కోహ్లి మనసులో కెప్టెన్సీ ఆలోచన లేదని తేలిపోయింది.
కాగా, ఇంగ్లండ్ తో జూన్ 20 నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సిరీస్ లో స్టార్ పేసర్ బుమ్రా అన్ని మ్యాచ్ లు ఆడడని అగార్కర్ తెలిపాడు. చివరగా జరిగిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించిన బుమ్రా గాయం ప్రభావంతో చివరి టెస్టు మధ్యలో వైదొలగాడు. తర్వాత దాదాపు మూడు నెలలు అందుబాటులో లేడు. కోలుకుని ఐపీఎల్ లోకి వచ్చాడు.
బుమ్రాను తరచూ ఇబ్బంది పెట్టే వెన్ను గాయం సమస్యను పరిగణనలోకి తీసుకుని.. అతడిపై మరింత భారం మోపదల్చుకోలేదని అగార్కర్ వివరించాడు. స్టార్ పేసర్ షమీని కూడా గాయం, ఫిట్ నెస్ లేని రీత్యానే తీసుకోలేదని తెలిపాడు. మొత్తానికి అగార్కర్ ఇచ్చిన సమాధానంతో కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
