Begin typing your search above and press return to search.

అహో విక్ర'మార్క్ రమ్'..మొన్నటిదాకా మన కాటేరమ్మ కొడుకే..నేడు లార్డ్

తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిన జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మోస్తరు భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఓపెనర్ గా సెంచరీ చేయడం అంటే అద్భుతమే..

By:  Tupaki Desk   |   14 Jun 2025 7:19 PM IST
అహో విక్రమార్క్ రమ్..మొన్నటిదాకా మన కాటేరమ్మ కొడుకే..నేడు లార్డ్
X

తొలి ఇన్నింగ్స్ లో ఆరు బంతులే ఆడి డకౌట్ అయిన ఓపెనర్.. దానిని మర్చిపోయేలా చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం అంటే అద్భుతమే..

తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడిన జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మోస్తరు భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఓపెనర్ గా సెంచరీ చేయడం అంటే అద్భుతమే..

సహచరులు ఔట్ అవుతున్నా.. మేటి పేస్ బౌలర్లను ఎదుర్కొంటూ.. సెంచరీ కొట్టి జట్టును గెలిపించడం అంటే అద్భుతమే.. ఈ మూడు అద్భుతాలు చేశాడు దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్ రమ్. అందుకే ఇప్పుడు అతడిని అహో విక్ర’మార్క్ రమ్’ అంటున్నారు.

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అద్భుత విజయం వెనుక వెన్నుముక ఓపెనర్ మార్క్ రమ్ అని చెప్పాలి. 136 పరుగుల అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పైగా ఓపెనర్ గా దిగిన అతడు గెలుపునకు కేవలం 6 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

వాస్తవానికి ఈ టెస్టులో మార్క్ రమ్ ఓపెపర్ గా రావాల్సిన వాడు కాదు. మరో ఓపెనర్ టోనీ జార్జిని పక్కనపెట్టిన దక్షిణాఫ్రికా మార్క్ రమ్ ను ఓపెనర్ గా పంపింది. ఇప్పుడు అతడు హీరోచితంగా ఆడి సెంచరీ కొట్టాడు. తమ దేశ హీరోగా మారాడు.

ప్రఖ్యాత లార్డ్స్ లో సెంచరీ కొట్టడం అనేది ప్రతి క్రికెటర్ కల. క్రికెట్ పుట్టిల్లుగా చెప్పే ఈ మైదానంలో సెంచరీ కొడితే అక్కడి పుస్తకంలోకి ఎక్కుతారు. అయితే, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు సాధించలేకపోయాడు. అయితే, ఇప్పడు అద్భుత సెంచరీతో దక్షిణాఫ్రికాను గెలిపించిన మార్క్ రమ్.. లార్డ్స్ తో పాటు చరిత్ర పుస్తకాల్లోకీ ఎక్కాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత సీజన్ వరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు మార్క్ రమ్. తనదైన దూకుడుతో స్కోర్లు చేశాడు. అయితే, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమ్మిన్స్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి వారి కోసం మార్క్ రమ్ ను సన్ రైజర్స్ మెగా వేలంలో రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడాడు. అలా కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు జట్టు మారాడు. మార్క్ రమ్ లేకపోవడం సన్ రైజర్స్ ను పెద్ద దెబ్బే కొట్టింది. మిడిలార్డర్ లో నిలిచేవాడు లేక జట్టు ఓడిపోయింది. ఇప్పుడు లార్డ్స్ సెంచరీతో మార్క్ రమ్ మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. కాటేరమ్మ కొడుకు అనిపించుకున్నాడు.