Begin typing your search above and press return to search.

అహో.. అఫ్ఠాన్.. భారత్ తోడుగా భవిష్యత్ అంతా నీదే..

కాస్త లక్ కలిసి.. మరికాస్త పోరాడి ఉంటే సెమీస్ కూ చేరేదే.. కానీ, లీగ్ దశతోనే ఆగిపోయింది. అయినా, భవిష్యత్ ఆ జట్టుదే అని అంటున్నారు క్రికెట్ పండితులు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 9:03 AM GMT
అహో.. అఫ్ఠాన్.. భారత్ తోడుగా భవిష్యత్ అంతా నీదే..
X

మాజీ చాంపియన్ పాకిస్థాన్ సెమీఫైనల్ కు చేరడం ఖాయం అనుకున్నారు.. మరో మాజీ చాంపియన్ శ్రీలంక నాలుగైదు మ్యాచ్ లైనా గెలుస్తుందనుకున్నారు.. బలమైన జట్టుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తుందనుకున్నారు.. కానీ ,ఇవేవీ ప్రంపచ కప్ లో ఆకట్టుకోలేదు. మూడు జట్లూ అంచనాలను అందుకోవడం విఫలమయ్యాయి. పైగా ఆటతీరు పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆయా జట్లలో లుకలుకలు బయల్దేరాయి. కానీ, ఒక్క జట్టు మాత్రం భళా అనిపించుకుంది. అదేమీ అద్భుతాలు సాధిస్తుందని అనుకోలేదు. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా గొప్పే అని భావించారు. కానీ, ఏకంగా సెమీఫైనల్ కు వచ్చినంత పనిచేసింది. కాస్త లక్ కలిసి.. మరికాస్త పోరాడి ఉంటే సెమీస్ కూ చేరేదే.. కానీ, లీగ్ దశతోనే ఆగిపోయింది. అయినా, భవిష్యత్ ఆ జట్టుదే అని అంటున్నారు క్రికెట్ పండితులు.

తాలిబన్ రాజ్యంలో క్రికెట్ పరిమళం..

రెండేళ్ల కిందట అఫ్ఘానిస్థాన్ లో ఎలాంటి వాతావరణం ఉందో అందరూ చూశారు. ప్రజా ప్రభుత్వం కూలిపోయి.. మతవాద తాలిబన్లు అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలు విమానాల రెక్కలు పట్టుకుని పారిపోయారు. అలాంటి అఫ్ఠాన్ లో ఇక క్రికెట్ పని ఖతం అనుకున్నారు. అప్పడప్పుడే ఎదుగుతున్న జట్టు ప్రమాణాలు పడిపోతాయని భావించారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. అఫ్ఘాన్ మరింత బలంగా తయారైంది. దీనికి నిదర్శనమే ప్రస్తుత ప్రపంచ కప్ లో ఆ జట్టు ప్రదర్శన. వాస్తవానికి ఈ కప్ లో గనుక అఫ్ఘాన్ మరొక్క విజయం సాధించినా సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారేది. అయితే, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో అఫ్ఘాన్ కు చాన్స్ లేకపోయింది.

ఆసీస్ కు చుక్కలు చూపింది..

ప్రపంచ కప్ లో హైలైట్ అనదగ్గ మ్యాచ్ ఏదన్నా ఉందంటే అఫ్ఘానిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచే. అఫ్ఘాన్ విధించిన 293 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఇదే ఊపులో అఫ్ఘాన్ జట్టు మరొక వికెట్ తీసి ఉంటే (ముఖ్యంగా మ్యాక్స్ వెల్) కచ్చితంగా గెలిచేది. కానీ, మ్యాక్స్ వెల్ ను నిలువరించలేకపోయింది. శుక్రవారం నాటి మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికాను కంగారు పెట్టింది అఫ్ఘాన్. 244 పరుగులు చేయడమే కాక.. 140కే ప్రత్యర్థి నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం రేపేలా కనిపించింది. అయితే డసెన్ పోరాటంతో దక్షిణాఫ్రికా గట్టెక్కింది.

బ్యాటింగ్ మెరుగైంది.. కానీ,

స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్.. అఫ్ఘాన్ బౌలింగ్ దళం ఇది. పేసర్ నవీనుల్ హక్ కూడా ప్రతిభావంతుడే. కానీ, బ్యాటింగ్ లోనే బలహీనం. అయితే, ప్రపంచ కప్ లో వారి బ్యాటర్లూ రాణించారు. ఇబ్రహీం జాద్రాన్‌ 9 మ్యాచ్‌ల్లో 47 సగటుతో 376 పరుగులు చేశాడు. ఓ సెంచరీ బాదాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు అఫ్ఘాన్ ఆటగాడిగా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 70.60 సగటుతో 353 పరుగులు చేశాడు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో మందకొడి పిచ్‌పై పట్టుదలగా చివరి వరకు నిలిచాడు. రహ్మత్‌ షా (320 పరుగులు), గుర్బాజ్‌ (280),కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (310 పరుగులు) ఎవరికి వారే ప్రతిభ చాటారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ షాహిది ఛేదనలో చివరి వరకూ క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎప్పటిలాగే బౌలింగ్ లో రషీద్‌ ఖాన్‌ (11 వికెట్లు), నబి (8), నవీనుల్‌ హక్‌ (8), ముజీబుర్‌ రెహ్మాన్‌ (8), అజ్మతుల్లా (7), ఫరూఖీ (6), నూర్‌ అహ్మద్‌ (5) రాణించారు.

పెద్ద జట్లకు షాక్.. లోపం అక్కడే.

ఇంగ్లాండ్‌ ను 69 పరుగులతో ఓడించిన అఫ్ఘాన్ కేవలం లక్ తో గెలిచిందనుకున్నారు. కానీ, పాకిస్థాన్, శ్రీలంకలనూ ఓడించి తమ సత్తా ఏమిటో చూపింది. ఆస్ట్రేలియా అయితే కేవలం లక్ తోనే బయటపడింది. అఫ్డాన్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఆ జట్టు ఆటగాళ్లు మంచి క్యాచ్ లు అందుకున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ, అఫ్ఘాన్ సరిచేసుకోవాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయి. గెలవాల్సిన మ్యాచ్ లను చేజార్చుకోవడం అందులో ఒకటి. ఉదాహరణకు ఆస్ట్రేలియాతో మ్యాచ్. ఇక పేస్ బౌలింగ్ పరంగా చాలా మెరుగుపడాలి. నవీనుల్ హక్ కు సరిజోడీని వెదకాలి. బ్యాటింగ్ లో స్థిరత్వం అవసరం. వాస్తవానికి ఈ ప్రపంచ కప్ లో రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేదు. నూర్, ముజీబ్ ఫర్వాలేదనిపించినా.. వీరు ఇంకా బాగా బౌలింగ్ చేసి ఉండాల్సింది.

అఫ్ఘాన్ వెనుక భారత్

అఫ్ఘాన్ విజయాల వెనుక భారత దేశం పాత్ర చాలా ఉంది. ఢిల్లీలోని విజయ్ సింగ్ పాఠక్ స్టేడియాన్ని ఏడేళ్ల కిందటే వారి ప్రాక్టీస్ కు ఇచ్చింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని మైదానం, లక్నోలోని ఏకానా స్టేడియంలో అఫ్ఘాన్ ఇతర జట్లతో మ్యాచ్ లు ఆడేందుకు అంగీకారం తెలిపింది. డెహ్రాడూన్ స్టేడియం అయితే అఫ్ఘాన్ సొంత మైదానం కిందనే లెక్క. కాగా, రషీద్ ఖాన్ వంటి మేటి స్పిన్నర్ వెలుగులోకి వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారానే కావడం విశేషం. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడడంతోనే కావడం గమనార్హం. నూర్, ముబీజ్, నబీ, గుర్బాజ్ వీరందరికీ ఐపీల్ గొప్ప లైఫ్ ఇచ్చింది.

కొసమెరుపు: ప్రపంచ కప్ టోర్నీ ముందు వరకు ఓ మాదిరిగా ఉన్న అఫ్ఘాన్ బ్యాటింగ్ ను టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ ఒకరు పటిష్ఠం చేశారు. దాని ఫలితమే ప్రపంచ కప్ లో అఫ్ఘాన్ బ్యాటర్లు గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. దీనివెనుక ఉన్న టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. డాషింగ్ బ్యాట్స్ మన్ అజయ్ జడేజా. ఇతడి సేవలను మున్ముందు కూడా అఫ్ఘాన్ కొనసాగిస్తే ఆ జట్టుకే మేలు.