ఎస్ఆర్ హెచ్ కే కాదు..ఆ ఫ్రాంచైజీల్లోనూ పాక్ ఆటగాళ్లు..ఏం చేస్తారు?
పాకిస్థాన్ కు ఒక దశలో టి20 కెప్టెన్ గా ఉన్న ఇమాద్ వాసిం.. 2023-24లో ఐఎల్టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున ఆడాడు.
By: Tupaki Political Desk | 14 March 2026 4:08 PM ISTదక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ (ఎస్ఏ లీగ్) ది హండ్రెడ్ లీగ్ వేలం పెద్ద దుమారమే రేగింది. సాధారణంగా అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట ఇదేమీ సంచలనం కాకపోయేది. కానీ, ఒక ఆటగాడు.. పైగా భారత క్రికెటర్ల పట్ల దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్ ఆటగాడి కారణంగా సంచలనంగా మారింది. సంబంధిత ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలకు గురికాగా, చివరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కల్పించుకుని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, అతడొక్కడే కాదు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన విదేశీ ఫ్రాంచైజీల్లో పలువురు పాక్ క్రికెటర్లు ఆడారు. కానీ, పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, ఆసియా కప్ షేక్ హ్యాండ్ ల వివాదం, ఆ టోర్నీ టైటిల్ ను పాకిస్థాన్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఎత్తుకెళ్లడం, టి20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్ వేసిన కుప్పిగంతుల నేపథ్యంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఆ పాకిస్థాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసింది మన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) యాజమాన్యం కావడం.
విదేశీ లీగ్ లతో ఏం సంబంధం?
పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గురించి అందరికీ తెలిసిందే. వాస్తవానికి టి20 ప్రపంచకప్ లో అతడే హైలైట్ అవుతాడని అనుకుంటే.. విభిన్న బౌలింగ్ శైలితో ఉస్మాన్ తారిఖ్ చర్చనీయం అయ్యాడు. అబ్రార్ ను ఎక్కుమ మ్యాచ్ లు కూడా ఆడించలేదు. అయితే, అతడిని ఎస్ఏ లీగ్ లో ట్రెంట్ రాకెట్స్ తో పోటీపడి మరీ సన్ రైజర్స్ లీడ్స్ రూ.2.34 కోట్లకు వేలంలో తీసుకుంది. ఇదంతా గురువారం జరిగింది. ఈ టోర్నీ ఐపీఎల్ తర్వాత జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు జరగనుంది. అబ్రార్ ఎంపిక పట్ల తీవ్ర విమర్శలు రావడమే కాదు.. సన్ రైజర్స్ ఎక్స్ ఖాతా కొద్దిసేపు నిలిపివేసే పరిస్థితి తలెత్తింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్వయంగా రంగంలోకి దిగి.. అదేమీ ఐపీఎల్ కాదని, విదేశీ లీగ్ లను బీసీసీఐ నియంత్రించలేదని స్పష్టత ఇచ్చారు.
అతడే కాదు వీరు కూడా...
సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ స్వయంగా పాల్గొన్న వేలంలో అబ్రార్ అహ్మద్ ను హండ్రెడ్ లీగ్ లోని సన్ రైజర్స్ లీడ్స్ కు ఎంపిక చేయడమే దుమారానికి కారణమైంది. అయితే, అబ్రారే కాదు పలువురు పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ లో నిషేధం ఉన్నా.. ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలతో లింక్ ఉన్న విదేశీ లీగ్ లలో ఆడుతున్నారు. ఈ ఫ్రాంచైజీలు కొన్ని భారతీయుల యాజమాన్యంలోనివి, మరికొన్ని కో పార్ట్ నర్ షిప్ లోనివి కావడం గమనార్హం.
కెప్టెన్ సైతం
పాకిస్థాన్ కు ఒక దశలో టి20 కెప్టెన్ గా ఉన్న ఇమాద్ వాసిం.. 2023-24లో ఐఎల్టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. గత రెండేళ్లుగా మేజర్ క్రికెట్ లీగ్ లో సీటెల్ ఓర్కాస్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఫ్రాంచైజీ.. ఐపీఎల్ లో జీఎంఆర్ గ్రూప్ నకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ తో అనుబంధం కలిగి ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యంలోని కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో పాక్ పేసర్ మొహమ్మద్ అమీర్, ఉస్మాన్ తారిక్ లు ట్రినిబాగో నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
-ముంబై ఉగ్రదాడుల అనంతరం 2009 నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేని సంగతి తెలిసిందే. ఆపై 2013 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా లేవు. ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత అసలే అవకాశం లేకుండా పోయింది.
-నిరుడు ఎస్ఏ లీగ్ లో సన్ రైజర్స్ లీడ్స్ ను ఇంగ్లండ్ -వేల్స్ క్రికెట్ బోర్డు, యార్క్ షైర్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
