Begin typing your search above and press return to search.

అభిషేక్ vs దిగ్వేష్: నిన్న రాత్రి ఏం జరిగింది? వైరల్ వీడియో

లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ రాథీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

By:  Tupaki Desk   |   20 May 2025 11:29 AM IST
అభిషేక్ vs దిగ్వేష్: నిన్న రాత్రి ఏం జరిగింది? వైరల్ వీడియో
X

లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ రాథీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరుస సిక్సర్లతో చెలరేగిపోతున్న అభిషేక్‌ను ఔట్ చేసిన తర్వాత, రాథీ తనదైన శైలిలో 'నోట్‌బుక్ సెలబ్రేషన్స్' చేసుకున్నాడు. ఇది గమనించిన అభిషేక్ అతడివైపు దూసుకెళ్లాడు. దీంతో మైదానంలో కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మకు కోపం వచ్చింది. ఈ మ్యాచ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన అభిషేక్.. ఔటైన తర్వాత బౌలర్ చేసిన పనితో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

-అసలేం జరిగింది?

లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. ట్రావిస్ హెడ్‌కు కరోనా సోకడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అథర్వ ట్రేడ్.. అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అథర్వ ట్రేడ్ (9 బంతుల్లో 13 పరుగులు) ఔటైనా, అభిషేక్ మాత్రం ఛేజింగ్‌లో తన జోరును కొనసాగించాడు. అభిషేక్ ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో చుక్కలు చూపించాడు. చివరి నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు తిరిగింది. అయితే ఆ తర్వాతి ఓవర్‌ వేసేందుకు దిగ్వేష్ రాథీ వచ్చాడు.

ఈ ఓవర్‌లో అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టాడు. కానీ టైమింగ్ మిస్ అవ్వడంతో ఆ బంతి వెళ్లి శార్దూల్ ఠాకూర్ చేతిలో పడింది. దీంతో దిగ్వేష్ తనదైన శైలిలో నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది అభిషేక్‌కు కోపం తెప్పించింది. దీంతో అతడు దిగ్వేష్ వైపు దూసుకెళ్లాడు. దిగ్వేష్ కూడా అదే విధంగా స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య చిన్నపాటి వాగ్వాదం నడిచింది. చివరకు అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 20 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

-ఆ తర్వాత ఏం జరిగింది?

అభిషేక్ ఔటైన తర్వాత, దిగ్వేష్ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. దీంతో స్టేడియంలో ఉన్న సన్‌రైజర్స్ అభిమానులు దిగ్వేష్ స్టైల్‌లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వైఎస్ చైర్మన్ తో ఈ వివాదంపై అభిషేక్ చెప్పుకొచ్చాడు. అనంతరం సర్ది చెప్పడంతో దిగ్వేష్, అభిషేక్ లు కరాచలనం చేసుకొని గొడవకు సద్దుమణిగించారు.