ప్రపంచ నెంబర్ 1 కార్ల్ సన్ కు గేమ్ లో షాకిచ్చిన మన బుడ్డోడు
విజయం తాత్కాలికం. దాన్ని శాశ్వితం చేసుకోవటం ఎవరికి సాధ్యం కాదు. కదిలే కాలంతో అన్ని మారిపోతుంటాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 10:30 AM ISTవిజయం తాత్కాలికం. దాన్ని శాశ్వితం చేసుకోవటం ఎవరికి సాధ్యం కాదు. కదిలే కాలంతో అన్ని మారిపోతుంటాయి. అందుకే అంటారు విజయం సాధించటం ఒక ఎత్తు. దాన్ని నిలబెట్టుకోవటం మరో ఎత్తు అని. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిసినప్పుడు ఈ మాటలో నిజమెంతో అర్థమవుతుంది. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంఫియన్ గా నిలిచిన నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,
అతగాడికి తన ఆటతో దిమ్మ తిరిగే షాకిచ్చాడు తొమ్మిదేళ్ల బుడ్డోడు. ఆ పిల్లాడు మనోడు కావటం మరో విశేషం. భారత చెస్ చిచ్చర పిడుగు అరిత కపిల్ తాజాగా జరిగిన ఒక మ్యాచ్ లో కార్ల్ సన్ కు చుక్కలు చూపించాడు. ఓడించినంత పని చేశాడు. ఢిల్లీకి చెందిన ఈ పిల్లాడు ఇటీవల జరిగిన జాతీయ అండర్ 9 ఛాంపియన్ షిప్ లో రన్నరప్ గా నిలిచాడు.
జార్జియాలోని తన హోటల్ నుంచి కార్ల్ సన్ తో ఆట ఆడాడు ఆరిత్. ఆటలో తన అధిక్యాన్ని ప్రదర్శించిన ఆరిత్.. ఒక దశలో ఓడించినంత పని చేశాడు. అయితే.. గడియారంలో కొన్ని సెకన్ల సమయమే ఉండటం.. తనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో.. ఆట డ్రాగా ముగిసింది. కాకుంటే.. పలుమార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ప్రముఖుడ్ని ఓటమి అంచుల వరకు తీసుకెళ్లిన ఆరిత్ కపిత్ ఆట అందరిని ఆకట్టుకుంది. ఈ టోర్నీలో పది పాయింట్లు సాధించిన ప్రణవ్ విజేతగా నిలిచాడు. కార్ల్ సన్.. హాన్స్ మోక్ నీమాన్ ఇద్దరు 9.5 పాయింట్లతో సమంగా నిలిచారు. ట్రైబ్రేక్ లో నీమాన్ రెండో స్థానం దక్కింది. మొత్తంగా ప్రపంచ విజేతకు చుక్కలు చూపించిన తొమ్మిదేళ్ల మన పిల్లాడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
