2001 మార్చి 14..! భారత క్రికెట్ ను మార్చిన ఆ రోజుకు పాతికేళ్లు
ఇందులో ప్రధాన పాత్ర హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ దే కావడం విశేషం. అతడి 281 పరుగుల మారథాన్ ఇన్సింగ్స్ శతాబ్దానికి ఒక్కటి అనడంలోనూ సందేహం లేదు.
By: Tupaki Political Desk | 14 March 2026 4:33 PM ISTఅప్పటికి ఆస్ట్రేలియా అంటే ప్రపంచ క్రికెట్ లో హడల్..! మైదానంలో వారి ఆటగాళ్ల ఆటే కాదు.. బాడీ లాంగ్వేజ్ కూడా అంతే దూకుడు.. దీనికితోడు నోటికి పనిచెప్పడంలో దిట్టలు..! మ్యాచ్ కు ముందే ప్రత్యర్థి జట్లు సగం నీరసించేవి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు 2001లో భారత పర్యటనకు వచ్చింది. ముంబైలో జరిగిన తొలి టెస్టులో ఏకంగా పది వికెట్ల తేడాతో నెగ్గింది. ఆ ఏడాది మార్చి 11-15 మధ్య కోల్ కతాలో జరిగింది రెండో టెస్టు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు చేస్తే.. భారత్ 171కే ఆలౌటైంది. సౌరబ్ గంగూలీ నాయకత్వంలోని టీమ్ఇండియాకు మరో ఓటమి తప్పదనే పరిస్థితి. సిరీస్ కూడా కోల్పోయే పరిస్థితి. కానీ, టీమ్ఇండియాను ఫాలో ఆన్ లో అద్భుతం చేసింది. ఇందులో ప్రధాన పాత్ర హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ దే కావడం విశేషం. అతడి 281 పరుగుల మారథాన్ ఇన్సింగ్స్ శతాబ్దానికి ఒక్కటి అనడంలోనూ సందేహం లేదు.
భారీ లోటు.. ఆపై ఆసీస్..
254 పరుగుల భారీ లోటు.. ఆస్ట్రేలియాలో మెక్ గ్రాత్, షేన్ వార్న్, గిలెస్పీ వంటి బౌలర్లు. కానీ, రెండో ఇన్నింగ్స్ లో టీమ్ఇండియాను మేటి బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ (180)తో కలిసి నిలబెట్టాడు లక్ష్మణ్. దీంతో.. తమ జట్టును ఓ ఆటాడుకుంటున్న అతడికి వెరీవెరీ స్పెషల్ (వీవీఎస్) అనే బిరుదు ఇచ్చేశారు ఆస్ట్రేలియన్లు. ద్రవిడ్ -లక్ష్మణ్ ల భాగస్వామ్యంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 657 పరుగులు చేసింది. కెప్టెన్ గంగూలీ (48) కొన్ని పరుగులు చేశాడు.
భజ్జీ మ్యాజిక్..
స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే లేకపోవడంతో టీమ్ఇండియా ఈ టెస్టులో అప్పటి 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పైనే ఆధారపడింది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టినా 123 పరుగులు ఇచ్చిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లోనూ దుమ్మరేపాడు. 384 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఆసీస్ ను 212 పరుగులకే కుప్పుకూల్చాడు. భజ్జీ ఈసారి 73 పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టులో హ్యాట్రిక్ కూడా సాధించిన అతడు.. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డులకెక్కాడు.
ఇద్దరు హైదరాబాదీలు..
టీమ్ఇండియా తరఫున ఇద్దరు హైదరాబాదీలు చారిత్రక కోల్ కతా టెస్టులో ఆడారు. వారిలో ఒకరు వీవీఎస్ లక్ష్మణ్ అయితే మరొకరు స్పిన్నర్ వెంకటపతి రాజు. రెండు ఇన్నింగ్స్ లో ఒకటే వికెట్ తీసిన వెంకటపతి రాజుకు కెరీర్ లో ఇదే చివరి టెస్టు కావడం గమనార్హం.
2001 మార్చి 11 నుంచి 15 మధ్య జరిగిన కోల్ కతా టెస్టు ఎందుకు చారిత్రకం అంటే.. అప్పటికి 15కు పైగా మ్యాచ్ లను గెలుస్తూ వచ్చిన ఆస్ట్రేలియా పొగరు అణచడమే కాదు.. వారి కెప్టెన్ స్టీవ్ వా ను టాస్ కోసం నిరీక్షించేలా చేయడం ద్వారా మానసికంగా దెబ్బకొట్టాడు సౌరబ్ గంగూలీ. మైదానంలో దిగాక మ్యాచ్ లో వెనుకబడి మరీ.. టీమ్ఇండియా గెలవడంతో ఆస్ట్రేలియా అహం మీద కొట్టినట్లయింది. నాటి నుంచి కంగారూ క్రికెట్ డామినేషన్ కు బీటలు మొదలయ్యాయి.
