Begin typing your search above and press return to search.

15 ఏళ్ల క్రితం.. టీమిండియాలో విరాట పర్వం షురూ

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:26 AM GMT
15 ఏళ్ల క్రితం.. టీమిండియాలో విరాట పర్వం షురూ
X

‘‘కుర్రాడు బాగా లేతగా ఉన్నాడు..’’ ‘‘ఈ మధ్యే అండర్ -19 ఆడి వచ్చాడు’’ సూపర్ హిట్ సినిమా ‘అతడు’ సినిమాలో ఆ సూపర్ డైలాగ్ ను అతడి విషయంలో కాస్త మార్చి చెప్పుకొంటే ఇలాగే ఉంటుంది. ఔను.. 15 ఏళ్ల కిందట దిగ్గజాల మధ్య అతడు ఓ లేత కుర్రాడే.. మొదట్లో అందరిలాగే తప్పటడుగులు వేసినవాడే.. దారితప్పినవాడే. కానీ, ఇప్పుడు చూస్తే తనే ఓ దిగ్గజంగా ఎదిగాడు. ఇదంతా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లి గురించి.. అతడు అంతర్జాతీయ క్రికెట్ లో తొలి మ్యాచ్ ఆడి శుక్రవారంతో 15 ఏళ్లు పూర్తయ్యాయి. మరిన్నేళ్లలో కోహ్లి ఎలా ఎదిగాడో చూద్దాం..?

ఒకప్పుడు సునీల్ గావస్కర్ రిటైరవుతుంటే.. అలాంటి బ్యాట్స మన్ మళ్లీ దొరుకుతాడా? అనుకున్నా.. కానీ, సచిన్ టెండూల్కర్ వచ్చాడు.. సచిన్ రిటైర్ అవుతుంటే.. మరొక సచిన్ పుడతాడా? అని కలగన్నా.. ఇంతలో రానే వచ్చాడు విరాట్ కోహ్లి. గావస్కర్ ను మరిపిస్తూ.. సచిన్ లా మురిపిస్తూ భారత క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు. ఈ సందర్భంగా #15YearsOfViratKohli ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

వారికి లేని ప్రత్యేకత కోహ్లిది..

టెస్టుల్లో మహా గొప్ప బ్యాట్స్ మన్ అయిన గావస్కర్ వన్డేలు పెద్దగా ఆడలేదు. ఆడినా అవి పెద్దగా రాణించినవి కాదు.. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ రికార్డులు కొల్లగొట్టిన సచిన్ టి20లకు దూరంగా ఉన్నాడు. కానీ, కోహ్లి అలా కాదు. టెస్టులు, వన్డేలు, టి20లతో పాటు ఐపీఎల్ లోనూ దుమ్మరేపాడు. సరిగ్గా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా మొదలైంది. అలా మొత్తం కోహ్లి నాలుగు ఫార్మాట్లు ఆడినట్లు అన్నమాట.

రన్ మెషిన్ కాదు.. విన్ మెషిన్

ఓ దశ వరకు గావస్కర్ టెస్టులు గెలిపించాడు. సచిన్ వన్డేల్లో విజయాలు సాధించిపెట్టాడు. కానీ, వీరికి లేని ప్రత్యేకత మరోటి కోహ్లిది. ఇతడు ఛేజ్ మాస్టర్. మ్యాచ్ లను గెలిపించడం ప్రతి ఆటగాడు చేస్తారు.. కానీ కోహ్లి ఛేజింగ్ లో గెలిపించడమే ప్రత్యేకత. సరిగ్గా ఏడాది కిందట టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై అతడు ఆడిన ఇన్నింగ్స్ దీనికి ఉదాహరణ. ఇలాంటివి టెస్టులు, వన్డేలు, టి20ల్లో ఎన్నో ఉన్నాయి. అందుకే

రన్ మెషిన్ కాదు. కోహ్లి విన్ మిషన్.

అంకితభావానికి ఆత్మవిశ్వాసం తోడైతే..

2006లో 16 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్ ఆడుతుండగా.. తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. కానీ, అతడు అంత బాధలోనూ కీలకమైన 90 పరుగులు చేసి ఢిల్లీ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. తర్వాతే తండ్రి అంత్యక్రియలకు వెళ్లాడు. ఇక 2008 అండర్ -19 ప్రపంచ కప్‌ లో యువ టీమిండియా విజేతగా నిలవడంలో కెప్టెన్ గా కోహ్లి పాత్ర ఎంతో ఉంది. ఆపై నాలుగు నెలలకే అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగు పెట్టాడు. నాటి కప్ లో 6 మ్యాచ్ లలో ఓ సెంచరీ సహా 47 సగటుతో 235 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి స్ఫూర్తి నింపడంలో తనకు తానే సాటి. తన దగ్గరకు వచ్చే ప్రత్యర్థి యువ ఆటగాళ్లకు క్రికెట్ పాఠాలు చెబుతూ మరింత రాణించాలని కోరుకుంటాడు.

2008లో శ్రీలంక టూర్ లో వన్డే సిరీస్ కు ఎంపికైన కోహ్లి తొలి అర్ధ శతకం చేయడానికి ఐదు మ్యాచ్‌ లు పట్టింది. కెరీర్ మొదటి సెంచరీ (107) కూడా శ్రీలంకపైనే చేశాడు. 2010లో టీ20ల్లో, 2011లో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. 3 ఫార్మాట్లలోనూ వందకు పైగా మ్యాచ్‌ లు ఆడాడు. మొత్తం 111 టెస్టులు, 275 వన్డేలు, 115 టీ20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2008-10 మధ్య కోహ్లి ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2010లో మూడు వన్డే సెంచరీలు చేశాడు. సొంత గడ్డపై జరిగిన 2011 ప్రపంచ కప్ లోనూ ఆడాడు. శ్రీలంకపై ఫైనల్‌ లో కీలకమైన 35 పరుగులు సాధించాడు.

మరో మూడేళ్లు..

ప్రస్తుతం 34 ఏళ్ల విరాట్ కోహ్లి మరో మూడు లేదా నాలుగేళ్లు ఆడే చాన్సుంది. గత మూడేళ్లుగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న అతడు ఈ ఏడాది పూర్తిస్థాయి ఫామ్ లోకి వచ్చాడు. 2019 చివరి నుంచి గతేడాది ఆసియా కప్ వరకు రెండున్నరేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆసియా కప్‌ లో అఫ్గానిస్థాన్‌ పై సెంచరీ చేశాక మళ్లీ మూడంకెల బాట పట్టాడు. టెస్టు, వన్డేల్లో ఇదే ఏడాది రెండేసి సెంచరీలు బాదేశాడు. మరో నాలుగేళ్లు ఆడితే గనుక కొన్ని రికార్డుల్లో సచిన్‌ ను మించుతాడు. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. కోహ్లి 46 శతకాలు చేశాడు. సచిన్ రికార్డును ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌ లలోనే అందుకోవచ్చు. అన్ని ఫార్మాట్లలో 9వేల పరుగుల నుంచి ప్రస్తుతం 25వేలకుపైగా (25,582) పరుగుల వరకు 50 సగటుతో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే.

అందిస్తాడా మూడో ప్రపంచ కప్

విరాట్ కెప్టెన్సీలో కొన్ని మెరుపులున్నా.. ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవలేకపోయింది. అయితే, సొంతగడ్డపై 2011 ప్రపంచ కప్ లో ఓ ఆటగాడి జట్టును గెలిపించిన అతడు.. ఇప్పుడు జట్టులో అత్యంత సీనియర్ గా సొంతగడ్డపై ప్రపంచ కప్ అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవానికి 2011 ప్రపంచ కప్ ఆడిన జట్టులో కోహ్లి ఒక్కడే ప్రస్తుత జట్టులో ఉన్నాడు.

టి20లకు దూరమైనట్టే..?

విరాట్ కోహ్లిని ఇకపై మనం టి20ల్లో చూడడం కష్టమేనా? దీనికి సమాధానం ఔననే చెప్పాలి. కోహ్లితో పాటు రోహిత్ నూ సెలక్టర్లు టి20 జట్టుకు పరిగణించడం లేదు. ఇది ఒకందుకు కోహ్లికి మంచిదే. అతడు ఇంకో ఏడాది టెస్టు కెరీర్ ను పొడిగించుకునేందుకు వీలవుతుంది. అందుకే.. 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న కోహ్లికి చెబుదాం.. ఆల్ ది బెస్ట్.