Begin typing your search above and press return to search.

14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ ఎంట్రీ అదిరిపోలా.. అతడి బ్యాక్ గ్రౌండ్ ఇదీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే తన మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

By:  Tupaki Desk   |   20 April 2025 4:59 AM
14-Year-Old Vaibhav Surya Vamsi Makes IPL Debut with Record-Breaking Six
X

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే తన మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ వేలంలో ఏకంగా 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతడి తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన వైభవ్.. తొలి బంతికే సిక్సర్ బాది స్టేడియాన్ని హోరెత్తించాడు.

సీనియర్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన స్వింగ్ బంతిని వైభవ్ కాస్త వెనక్కి తగ్గి కవర్స్ మీదుగా భారీ షాట్‌తో స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ ఒక్క సిక్సర్‌తోనే వైభవ్ కేవలం ఆటగాడిగానే కాకుండా, ధైర్యంగా ఆడే సత్తా ఉన్న కుర్రాడిగా తన ముద్ర వేశాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్ మొత్తం 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే, మార్‌క్రమ్ వేసిన బంతికి షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చిన వైభవ్ కీపర్ రిషబ్ పంత్‌కు స్టంపౌట్ అయ్యాడు. పెవిలియన్ కు వెళ్తూ కంటతడి పెట్టిన వైభవ్ ను చూసి ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

రాజస్థాన్ బౌలింగ్ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలో యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) మంచి ఆరంభాన్నిచ్చినా, చివర్లో లఖ్‌నవూ బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్‌ను 2 పరుగుల తేడాతో ఓడించాడు. లఖ్‌నవూ తొలుత 180 పరుగులు చేయగా, రాజస్థాన్ 178 పరుగులకే పరిమితమైంది.

ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మాత్రం వైభవ్ సూర్యవంశినే. కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు పలువురు క్రికెట్ దిగ్గజాలు అతడి ఆటతీరును ప్రశంసిస్తున్నారు. ఇదే జోరును వైభవ్ కొనసాగిస్తే, భారత క్రికెట్‌కు మరో యువ సంచలనం దొరికినట్లేనని చెప్పడంలో సందేహం లేదు. వచ్చే గురువారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లోనూ అతడికి చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

- 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు..

18 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా చేరాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడటంతో అతడి స్థానంలో వైభవ్ కు అవకాశం లభించింది. 14 సంవత్సరాల 23 రోజుల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ప్రయాస్ రాయ్ బర్మన్ (16 సంవత్సరాల 157 రోజులు), ముజీబ్ రెహ్మాన్ (17 సంవత్సరాల 11 రోజులు), రియాన్ పరాగ్ (17 సంవత్సరాల 152 రోజులు), ప్రదీప్ సాంగ్ వాన్ (17 సంవత్సరాల 179 రోజులు) ఈ జాబితాలో ఉన్నారు.

-తొలి బంతికి సిక్సర్ కొట్టింది వీళ్లే..

ఐపీఎల్‌లో తాము ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ కూడా చేరాడు. రాబ్ క్వినే, కేవన్ కూపర్, ఆండ్రూ రస్సెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, అనికేత్ చౌదరి, జావోన్ సీయర్ లెస్, సిద్దేశ్ లాడ్, మహేష్ తీక్షణ, సమీర్ రిజ్వి వంటి ఆటగాళ్లు గతంలో ఈ ఘనత సాధించారు. అయితే, ఈ జాబితాలో వైభవ్ అత్యంత చిన్న వయస్కుడిగా నిలవడం విశేషం.

-వైభవ్ తండ్రి కష్టానికి ప్రతిఫలం!

ఐపీఎల్ కేవలం ధనిక లీగ్ మాత్రమే కాదు, ఎంతోమంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదిక. బీహార్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన వైభవ్ ఈ వేదికపై తనదైన ముద్ర వేస్తున్నాడు. అతడి తండ్రి ఒక సాధారణ విలేకరి. కొడుకులోని క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను గుర్తించి అతడిని ప్రోత్సహించాడు. స్వయంగా తొలి గురువుగా మారి శిక్షణ ఇచ్చాడు. తనకున్న కొద్దిపాటి స్థలంలోనే కొడుకు కోసం క్రికెట్ మైదానం ఏర్పాటు చేశాడు. అక్కడే ఓనమాలు నేర్చుకున్న వైభవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో రాజస్థాన్, ఢిల్లీ జట్లు పోటీపడేలా చేశాడు. చివరకు 1.1 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ జట్టు అతడిని సొంతం చేసుకుంది.

కేవలం 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన వైభవ్ దూకుడు ఆటతీరుతో అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ బౌలర్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టడం అతడి ధైర్యానికి, ప్రతిభకు నిదర్శనం. 14 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు ఒక గొప్ప ఆస్తిగా మారతాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.