Begin typing your search above and press return to search.

2025లో ముంబైలో రూ.14,750 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు.. అఖండ రికార్డు

By:  Tupaki Desk   |   22 July 2025 7:31 PM IST
2025లో ముంబైలో రూ.14,750 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు.. అఖండ రికార్డు
X

ముంబై లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025 ప్రథమార్థంలో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఆరు నెలల కాలంలో రూ.14,750 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువగల ఇళ్ల అమ్మకాల పరంగా ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక అర్ధవార్షిక విలువగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.12,300 కోట్లతో పోలిస్తే ఈసారి 11 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ.. సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

రూ.28,750 కోట్ల అమ్మకాలు: చారిత్రక రికార్డు

2024 రెండవార్ధం నుంచి 2025 ప్రథమార్థం వరకు మొత్తం రూ.28,750 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ముంబై లగ్జరీ గృహ మార్కెట్ చరిత్రలో అత్యధిక స్థాయి అమ్మకంగా నిలిచింది. ఈ అసాధారణ వృద్ధికి అనేక కారణాలున్నాయని నివేదిక పేర్కొంది. సంపన్నుల ఆస్తులు పెరగడం, పెట్టుబడిదారుల విశ్వాసం, ఆధునిక మౌలిక సదుపాయాలు, నాణ్యమైన కొత్త ప్రాజెక్టులు, అధిక నికర విలువ గల వ్యక్తుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి ఈ వృద్ధికి కీలక కారణాలు.

వర్లీ, బాంద్రా వెస్ట్ టాప్ మార్కెట్లు

ముంబై లగ్జరీ మార్కెట్‌లో వర్లీ తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రైమరీ మార్కెట్ అమ్మకాలలో 22 శాతం వాటా వర్లీ నుంచే వచ్చింది. బాంద్రా వెస్ట్ అమ్మకాలలో 192 శాతం భారీ వృద్ధిని సాధించగా, టార్డియో ప్రాంతంలో 254 శాతం వృద్ధి నమోదైంది. ప్రభాదేవి, మలబార్ హిల్ వంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి మాంద్యం లేకుండా డిమాండ్ నిలకడగా కొనసాగింది.

ప్రైమరీ మార్కెట్ ఆధిక్యం, సెకండరీ కూడా బలంగా..

మొత్తం లగ్జరీ గృహ విక్రయాల్లో సుమారు మూడో వంతు అమ్మకాలు ప్రైమరీ మార్కెట్ నుంచే జరిగాయి. సెకండరీ మార్కెట్‌ నుంచి రూ.3,750 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యధికంగా నమోదైన సెకండరీ మార్కెట్ విక్రయాలు.

కస్టమర్ ప్రొఫైల్: పెరుగుతున్న పెద్దల కొనుగోళ్లు

45–65 ఏళ్ల మధ్య వయస్సు గల వారు లగ్జరీ గృహాలను కొనుగోలు చేసే వారిలో ప్రధానంగా ఉన్నారు. అయితే 65 ఏళ్లు పైబడిన కొనుగోలు దారుల శాతం కూడా 15% వరకు పెరిగిందని నివేదికలో వెల్లడైంది. 2,000 నుంచి 4,000 చదరపు అడుగుల మధ్య ఉన్న అపార్టుమెంట్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఇవే ప్రైమరీ అమ్మకాలలో 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

రెండురోజుల కాలంలోనే 1,335 లగ్జరీ యూనిట్ల విక్రయం

గత 12 నెలల కాలంలో 1,335 లగ్జరీ యూనిట్లు విక్రయమైనట్లు రికార్డైంది. ఇది ఏ సంవత్సర కాలంలోనూ అత్యధిక లగ్జరీ ఇళ్ల అమ్మకాలుగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్య ధరగల ఇళ్లలో కొనుగోలు ఆసక్తి పెరుగుతుండటంతో ఈ విభాగంలో స్థిరంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా పేర్కొన్నారు.

ముంబై లగ్జరీ గృహ మార్కెట్ అప్రతిహత వేగంతో దూసుకెళ్తోంది. ఇది నగరంలోని ఉన్నత వర్గాల పెట్టుబడి వ్యూహాలను, ఆకర్షణీయ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వసతులను, ఇంకా ముంబై నగరానికి ఉన్న దీర్ఘకాలిక ఆకర్షణను స్పష్టంగా వెల్లడిస్తోంది.