Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాల వేళ. హైదరాబాద్ రియల్ బూమ్ మాటేంటి?

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పక్షం నుంచి ఒక వాదన బలంగా వినిపించింది

By:  Tupaki Desk   |   5 Dec 2023 2:30 PM GMT
ఎన్నికల ఫలితాల వేళ. హైదరాబాద్ రియల్ బూమ్ మాటేంటి?
X

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పక్షం నుంచి ఒక వాదన బలంగా వినిపించింది. పదేళ్లు స్థిరమైన ప్రభుత్వం.. శాంతిభద్రతలకు ఢోకా లేని సర్కారు నేపథ్యంలో ఆస్తుల విలువ భారీగా పెరిగాయని.. కొత్త ప్రభుత్వం వస్తే ఆగమాగం అవుతుందన్న మాట బలంగా వినిపించింది. ఈ వాదనకు తగ్గట్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయన్న మాట బలంగా వినిపిస్తోంది. మరో రెండు.. మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాటేంటి? ఇంతవరకు జోరుగా సాగిన రియల్ వ్యవహారం ఇప్పుడేం కానుంది? అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఇలాంటి వేళ.. ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విషయం క్లారిటీ వచ్చినంతనే.. వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన పాత మాటలు అందులో ఉన్నాయి. తాను రియల్ ఎస్టేట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎదిగానని.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదన్న మాటలు ఉంటాయి. ఈ వీడియో ద్వారా బీఆర్ఎస్ నేతల వాదనకు సరైన కౌంటర్ గా చెబుతున్నారు.

రాజకీయాల్ని పక్కన పెట్టేస్తే.. వాస్తవ కోణంలో చూసినప్పుడు రియల్ఎస్టేట్ ఎలా ఉండనుంది? తెలంగాణలోని జిల్లాల లెక్క ఒకటైతే.. హైదరాబాద్ మహానగర లెక్క మరొకటి. ఈ అంశంపై నిపుణులతోనూ.. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారితో మాట్లాడినప్పుడుఆసక్తికర అంశాల్నివెల్లడించారు. ప్రభుత్వాలు ఏవైనా సరే.. డెవలప్ మెంట్ ను కోరుకుంటాయి. ఒకసారి డెవలప్ మెంట్ కానీ ఆగిపోతే.. అక్కడితో ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. ఎందుకంటే.. డెవలప్ మెంట్ ఆగినంతనే ఆదాయం తగ్గుతుంది. అదే జరిగితే.. ప్రభుత్వం బండి నడవటానికి అవసరమైన ఇంధనం తగ్గుతుంది.

అందుకే.. తెలంగాణకు ప్రాణాయువైన రియల్ రంగాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండవన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. ప్రభుత్వాలు మారినంతనే వారి ప్రాధాన్యాలు మారటం మామూలే. తెలంగాణకు ఆయువుగా నిలిచే హైదరాబాద్ మహానగరాన్ని మరింతగా తీర్చి దిద్దే అంశం మీదనే ప్రభుత్వం ఫోకస్ పెట్టే వీలుంది. ప్రభుత్వాలు మారిన వేళలో.. మార్కెట్లు స్తబ్దుగా మారటం మామూలే. ఇందుకు తగ్గట్లే.. రాబోయే ఆర్నెల్లలో మార్కెట్ ప్లాట్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా రియల్ బూమ్ ఎలా ఉంటుందన్నది అంచనా వేయొచ్చని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు అయితే భూములు కానీ ప్లాట్ల ధరలు కానీ తగ్గే అవకాశాలు తక్కువ. అలా అని పెరిగే ఛాన్సు ఉండదు. రెండు.. మూడు నెలల టెస్టింగ్ పిరియడ్ కు తగ్గట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇంతకాలం టైర్ 2, టైర్ 3 బిల్డర్లకు వచ్చినన్నిలాభాలు రానున్న రోజుల్లో రాకున్నా.. ప్రభుత్వం ఒకసారి స్థిరపడి.. తన నిర్ణయాల ఆధారంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పాలి.

కేసీఆర్ సర్కారు హయాంలో ట్రిపుల్ వన్ జీవో మీద చేసిన హడావుడి చాలానే ఉంది. ఈ కారణంగా రియల్ బూమ్ మరింత ముందుకు వెళ్లేలా చేసింది. కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో ఎక్కడా ట్రిపుల్ వన్ జీవో గురించి.. దాని ఎత్తివేత మీద ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు కాబట్టి.. ఆ ప్రాంతాల్లో భూములు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మహానగరం లో గజం 40వేల రూపాయిలకు పైగా ధరలు ఉన్న చోట.. ధరలు వెంటనే పెరిగే వీలు ఉండదని చెప్పాలి. ఔటర్ దగ్గర్లో గజం రూ.20వేలకు.. అంతకంటే తక్కువకు కొనుగోలు చేసే వారికి లాభాలు రావొచ్చు. ఏది ఏమైనా.. గతంలో మాదిరి కోటిపెడితే ఏడాదిలో కోటిన్నర అయ్యేంత దూకుడు ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. రానున్న ఆర్నెల్లు చాలా కీలకం. ఆ టైంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆధారంగానే రియల్ బూమ్ ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.