Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ? ఎంతమందికి పూర్తైంది?

By:  Tupaki Desk   |   18 Jun 2021 12:00 PM IST
వ్యాక్సినేషన్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ? ఎంతమందికి పూర్తైంది?
X
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే సామర్థ్యం వ్యాక్సిన్ కు మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే. హెర్డ్ ఇమ్యూనిటీ మీద పలు వాదనలు వినిపించినా.. టీకా వేసుకుంటే వచ్చే ఇమ్యునిటితో పోలిస్తే.. హెర్డ్ ఇమ్యూనిటీ ఏ మూలకు సరిపోదన్న విషయం ఇటీవల సాగిన అధ్యయనాలతో పాటు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెకండ్ వేవ్ దెబ్బకు వ్యాక్సినేషన్ అవసరం ఏమిటన్న విషయాన్ని అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు ప్రజలకు అర్థమైంది. సెకండ్ వేవ్ ముందు వరకు టీకా వేయించుకోవటానికి సంశయించిన వారంతా ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం క్యూ కడుతున్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ మొదలై ఆర్నెల్లు అయ్యింది. మరి.. దేశ సగటు ఎంత? దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంతమేర వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. మన తెలుగు రాష్ట్రాల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు సాగిన వ్యాక్సినేషన్ ను చూసినప్పుడు చిన్నరాష్ట్రాల్లో టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. లక్ష్యాన్ని వారు త్వరగా చేరుకుంటున్నారు. దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా బుల్లి రాష్ట్రమైన గోవా నిలిచింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 37.35 శాతం మందికి మొదటి డోసు టీకాలు వేశారు.

1. గోవా 37.35 శాతం
2. సిక్కిం 37.29 శాతం
3. హిమాచల్ ప్రదేశ్ 30.35 శాతం
4. త్రిపుర 29.07
5. కేరళ 26.23 శాతం
6. గుజరాత్ 25.69 శాతం
7. ఢిల్లీ 25.39 శాతం

రెండో స్థానంలో సిక్కిం నిలవగా... తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్.. త్రిపుర.. కేరళ.. గుజరాత్.. ఢిల్లీలు ఉన్నాయి. అదే సమయంలో పెద్ద రాష్ట్రాలైన యూపీ.. బిహార్..అసోం.. జార్ఖండ్.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. మరి.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. తెలంగాణలో ఇప్పటివరకు 19 శాతం మంది టీకా వేసుకోగా.. ఏపీలో 18 శాతం మందికి ఇప్పడు టీకాలు వేశారు. పెద్ద రాష్ట్రాల్లో కర్నాటక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో 22 శాతం మందికి టీకాలు వేశారు. జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ 15.7 శాతంగా ఉంది. ఈ లెక్కన 50 శాతానికి తెలుగు రాష్ట్రాలు చాలా దూరంలో ఉన్నాయని చెప్పక తప్పదు.