Begin typing your search above and press return to search.

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి..

By:  Tupaki Desk   |   1 Jan 2022 8:59 AM IST
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి..
X
2022 కొత్త సంవత్సరానికి సాదరంగా స్వాగతం పలుకుతున్న వేళ అనుకోని ఉపద్రవం చోటుచేసుకుంది. విషాద గీతిక ఆలపించింది. జమ్మూకశ్మీర్ లో కొత్త సంవత్సరం సందర్భంగా మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దీని కారణంగా ఇప్పటివరకూ 12 మంది మరణించారని.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని సమాచారం.

గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ సంఘటన త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఇందులో తొక్కిసలాట జరిగింది. జిల్లా అధికారులు, ఆలయ బోర్డు అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

పలువురు వ్యక్తులు చనిపోయారని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తీవ్రంగా గాయపడ్డ మరో 26 మందిని మాతా వైష్ణో దేవి నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా ఇతర ఆస్పత్రుల్లో చేర్చారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మర్ కు చెందిన వారు ఉన్నారని తెలిపారు.

-ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి..మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ జనరల్ తో మాట్లాడిన ప్రధాని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు అందిస్తామన్నారు.