Begin typing your search above and press return to search.

తనపై ఆరోపణలు, ఆఫర్లను బయటపెట్టిన సోనూసూద్

By:  Tupaki Desk   |   21 Sept 2021 9:40 AM IST
తనపై ఆరోపణలు, ఆఫర్లను బయటపెట్టిన సోనూసూద్
X
కరోనా లాక్ డౌన్ వేళ ఎంతో మందికి సేవ చేసిన ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ పై ఇటీవల ఐటీ దాడులు కలకలం రేపాయి. మూడు రోజుల పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. ఇందులో సోనూసూద్ తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సీబీడీటీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా సోనూద్ ఈ విషయంపై అధికారికంగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశాడు.

కొందరు అతిథుల సేవలో తీరిక లేకుండా ఉన్నానని.. అందుకే గత నాలుగు రోజులుగా ప్రజలకు సేవ చేయకపోయానని సోనూసూద్ వివరించారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’లో ఉన్న ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఆపన్నులను ఆదుకోవడానికే ఖర్చు చేస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్ స్టాగ్రామ్ లో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు.

‘నా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్ లు 54000 ఉన్నాయి. సాయం కోసం ఎంతో మంది అర్థిస్తున్నారు. రూ.18 కోట్లు ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదు.. కానీ ప్రతి పైసా సరైన విధంగా అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే నా ఆలోచన..’ అని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.

రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని రెండు వేర్వేరు పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించా.. ఇప్పుడున్న హోదాతో సంతోషంగానే ఉన్నా.. మానసికంగా సిద్ధమైనప్పుడు చెబుతా.. నా సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి.. ఆపడానికి కాదు ప్రారంభించింది.. ఇది ఆరంభం మాత్రమే’ అని సోనూ సూద్ స్పష్టం చేశారు.

తనపై ఐటీ దాడుల గురించి కూడా సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. అన్ని వేళలా మన వాదనను మనం వినిపించలేకపోవచ్చు. కానీ కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. నా ఫౌండేషన్ లోని ప్రతి రూపాయి ప్రజల సేవ కోసం.. వారి ప్రాణాలను రక్షించడం కోసం ఎదురుచూస్తోంది. సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు కోసం బ్రాండ్ల తరుఫున ప్రచారం చేశా.. ఫౌండేషన్ కు ఎవరైనా ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా దానికి లెక్క చెబుతా.. నేనుసేకరించిన సొమ్ము ప్రజల విరాళాలే కాదు.. అందులో బ్రాండ్లకు ప్రచారకర్తగా నేను సంపాదించిన డబ్బు కూడా ఉందని తెలిపారు.

మొత్తంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తనపై ఐటీ దాడులు చేయించడం.. 18 కోట్లు లెక్కచెప్పడం అది వైరల్ కావడంతో ఇప్పుడు సోనూసూద్ బయటకు వచ్చి తన వివరణ ఇచ్చుకున్నాడు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..