Begin typing your search above and press return to search.

షాకింగ్.. వారంలో రెండు కోట్ల కేసులు.!

By:  Tupaki Desk   |   27 Jan 2022 8:42 AM GMT
షాకింగ్.. వారంలో రెండు కోట్ల కేసులు.!
X
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం గజగజ వణికి పోతోంది. ఒకటి, రెండు, మూడు వేవ్ లు అంటూ ఒకటి తర్వాత ఒకటి వస్తూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త వేరియంట్లలో రూపంలో వైరస్ విరుచుకుపడుతుంది. దీంతో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క రోజు లోనే 35 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా వైరస్ తో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒక్క రోజులోనే పదివేల మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 56 లక్షల 45 వేలు దాటింది.

అంతేగాకుండా వివిధ దేశాలలో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేవలం ఒక్క అమెరికా లోనే ఐదు లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఫ్రాన్స్ లో కూడా నాలుగు లక్షల కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. బ్రెజిల్లో రెండు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ఆరు వందల మందికి పైగా చనిపోయారు. అంతేకాకుండా ఇటలీలో కూడా కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. గడచిన 24 గంటల్లో లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే కేసుల సంఖ్య భారీగా పెరగడం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం జనవరి 17 నుంచి 23 వరకూ సుమారు రెండు కోట్లకు పైగా మంది వైరస్ బారిన పడినట్టే తెలిపింది. ఈ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే మొదటిసారి అని స్పష్టం చేసింది. అయితే గత వారం తో పోలిస్తే సుమారు పెరిగిన కేసుల సంఖ్య 5 శాతాన్ని దాటినట్లు డబ్ల్యూహెచ్ఓ పరిశోధక బృందం గుర్తించింది. కేవలం ఒకే ఒక్క వారం ఈ రోజుల్లో రెండు కోట్లకు పైగా కేసులు నమోదు కావడం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఇలా ఎక్కువ కేసులు నమోదయ్యే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ప్రస్తుతం ఎక్కువ కేసులు అగ్రరాజ్యమైన అమెరికాలో నమోదు అవుతున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్ లో, ఇటలీ,అర్జెంటీనాల్లో కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది. కొవిడ్ ప్రోటాకాల్ ను పాటించడం ద్వారా కేసులు సంఖ్య తగ్గే వీలుందని పేర్కొంది. అందుకే భౌతిక దూరం పాటించాలని కోరింది.