Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: అరగంటలో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి

By:  Tupaki Desk   |   24 Feb 2022 9:40 AM GMT
#RussiaUkrainewar: అరగంటలో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
X
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇన్వెస్టెర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. పుతిన్ యుద్ధ ప్రకటన నేపథ్యంలో భారత్ సహా ఆసియా మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి.

భారత స్టాక్ మార్కెట్లు నిన్నటివరకూ వరుసగా 5 రోజుల పాటు నష్టపోయాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా వరుస నష్టాల నేపథ్యంలో నిన్నటివరకూ ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

నేడు పుతిన్ చేసిన యుద్ధ ప్రకటనతో ఐదురోజుల్లో దాని కంటే ఎక్కువగానే పెట్టుబడిదారులు నష్టపోయారు. భారత సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు నష్టపోయింది.

పుతిన్ యుద్ధ ప్రకటన చేసిన తర్వాత భారత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.8 లక్షల కోట్లు పడిపోయింది. దీంతో పెట్టుబడిదారుల సంపద క్రితం సెషన్ లో 255.68 లక్షల కోట్ల నుంచి నేడు ప్రారంభ సెషన్ లో 248 లక్షల కోట్లకు తగ్గింది.

జనవరి 17న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.280 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు 250 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి సెన్సెక్స్ 3367 పాయింట్లు పడిపోయింది.

అమెరికా నాస్ డాక్ క్రితం సెషన్ లో 2.57 శాతం క్షీణించింది. డౌజోన్స్ 1.38 శాతం, ఎస్ అండ్ పీ 1.84 శాతం క్షీణించింది. యూరోపియన్ మార్కెట్ చూస్తే ఫ్రాన్స్ 0.10 శాతం, డీఏెక్స్ (జర్మన్ ) 0.42 శాతం నష్టపోయాయి. పుతిన్ ప్రకటన తర్వాత నేడు ఆసియా మార్కెట్లు అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.