Begin typing your search above and press return to search.

అవును ఈరోజు నుంచి ఎంప్లాయిస్ ను తీసేస్తున్నాం: జూకర్ బర్గ్

By:  Tupaki Desk   |   9 Nov 2022 8:30 AM GMT
అవును ఈరోజు నుంచి ఎంప్లాయిస్ ను తీసేస్తున్నాం: జూకర్ బర్గ్
X
ప్రముఖ సోషల్ దిగ్గజ సంస్థ ఫేస్ బుక్(మెటా) తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. మెటాలో ప్రస్తుతం 87వేల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో చాలా మందిని ఇంటికి పంపించేందుకు మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ నేటి నుంచే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఇదే విషయాన్ని మెటా ఉద్యోగులు సైతం ధృవీకరించారు. కంపెనీ తప్పుడు నిర్ణయాలకు తమను బలి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన కంపెనీ సమావేశంలో ఉద్యోగుల తొలగింపు అంశంపై మెటా సీఈవో జూకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మెటాలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించడం తప్పనిసరి అన్నట్లు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే బుధవారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మెటా ప్రారంభించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై మాత్రం మెటా ధృవీకరించకపోవడం గమనార్హం.

ప్రధానంగా రిక్రూటింగ్..బిజినెస్ గ్రూపులకు చెందిన ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఉద్యోగాలు కోల్పోయే వారికి సుమారు నాలుగు నెలల జీతాన్ని ముందస్తుగానే హెచ్ఆర్ విభాగం ఇవ్వనుందని సమాచారం. ఇకపోతే ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

కరోనా ఎఫెక్ట్ తో ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో మెటాకు ఇటీవలి కాలంలో భారీగా ఆదాయం తగ్గింది. ప్రముఖ సంస్థలన్నీ కూడా అడ్వటైజ్ మెంట్లు ఇవ్వడం తగ్గించుకోవడం మెటాపై ప్రభావం చూపుతోంది. అలాగే టిక్ టాక్ నుంచి పోటీ.. ఆపిల్ తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇకపోతే కంపెనీ 18ఏళ్ళ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓవైపు ట్విటర్ అధినేత ఎలాన్ మాస్క్ ఉద్యోగులకు భారీగా తొలగిస్తున్న సమయంలోనే మార్క్ జూకర్ బర్గ్ సైతం అతడినే ఫాలో కావడం ఆసక్తిని రేపుతోంది. ఏదిఏమైనా ప్రముఖ సోషల్ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఉద్యోగులను వరుసబెట్టి ఇంటికి సాగనంపుతుండటం ఆందోళనను కలిగిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.