Begin typing your search above and press return to search.

సచివాలయ ఉద్యోగుల ఇష్యూను తేల్చేసిన ‘తమ్ముడు’

By:  Tupaki Desk   |   6 Jun 2016 10:10 AM GMT
సచివాలయ ఉద్యోగుల ఇష్యూను తేల్చేసిన ‘తమ్ముడు’
X
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లేందుకు హైదరాబాద్ లోని సచివాలయ ఉద్యోగులు లేవనెత్తుతున్న ఇష్యూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా తెలుగుదేశంనేతలు ఎవరూ స్పందించని పరిస్థితి. దీనికి భిన్నంగా తాజాగా ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ తొలిసారి విస్పష్టమైన గళాన్నివిప్పారు. విభజన జరిగి రెండేళ్లు పూర్తి అయిన తర్వాత కూడా రాజధానికి తరలి రావటానికి సచివాలయ ఉద్యోగులకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగులకు కావాల్సినంత టైం ఇవ్వటంతో పాటు.. గౌరవం ఇచ్చారని.. అయినా కొందరు ఉద్యోగులకు అమరావతికి రావటం ఇష్టంగా లేదన్న ఆయన.. అలా ఇష్టపడని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. నిరుద్యోగ యువతకు కాసిన్ని ఉద్యోగాలు వస్తాయంటూ రాజేంద్రప్రసాద్ మండిపడటం విశేషం.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలే కానీ.. బీజేపీ నేత పురంధేశ్వరిని కలవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ధిక్కారంగా అభివర్ణిస్తున్నారు. ఏపీ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి మెతక వైఖరిని విడిచి పెట్టి కఠినంగా ఉండాలంటూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీ సచివాలయ ఉద్యోగుల తీరును ఇంతగా వ్యతిరేకించిన ఏకైక తెలుగు తమ్ముడు రాజేంద్రప్రసాదేనని చెబుతున్నారు. రాజేంద్రప్రసాద్ ను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు తమ్ముళ్లు ఈ ఇష్యూ మీద గళం విప్పుతారేమో చూడాలి.