Begin typing your search above and press return to search.

విశాఖలో వైవీ : మార్నింగ్ వాకింగులూ....అధికారులతో మీటింగులూ...

By:  Tupaki Desk   |   18 Jun 2022 6:30 AM GMT
విశాఖలో వైవీ : మార్నింగ్ వాకింగులూ....అధికారులతో మీటింగులూ...
X
ఏపీ సీఎం జగన్ సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి విశాఖ సాగర తీరంలో వాకింగులు చేస్తున్నారు. పొద్దు పొద్దున్నే లేచి బీచ్ లో నడక అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ఆయన మార్నింగ్ వాకింగ్ లో విశాఖ జిల్లా కలెక్టరూ ఇతర ఉన్నతాధికారులూ కనిపిస్తున్నారు. ఆయన వాకింగులోనే అన్నీ మాట్లాడేస్తున్నారు అని అంటున్నారు.

ఇక పార్టీ నేతలను అందరినీ కూర్చోబెట్టి హాట్ హాట్ మీటింగులూ పెడుతున్నారు. మంత్రులు సామంతులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఆయనతోనే ఉంటున్నారు. మొత్తానికి ఏడు పదులు దాటిన వైవీ సుబ్బారెడ్డి వైసీపీకి ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులు అయ్యాక మెల్లగా జోరు చేస్తున్నారు. ఆయన తరచూ విశాఖ రావడం మొదలెట్టారు.

ఆదిలో ఆయన తిరుపతి టూ హైదరాబాద్ అనేవారు. ఆయనకు విశాఖ రావడానికి ఏమి తీరిక ఉంటుంది అని కూడా పార్టీ వారు భావించేవారు. కానీ ఇపుడు చూస్తే వైవీ తీరిక మాత్రమే కాదు ఓపిక కూడా చేసుకుని విశాఖకు రెగ్యులర్ గా వస్తున్నారు. తొందరలో ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

ఇక వైవీ విశాఖ వస్తూనే ఒకరికి టికెట్ ఇప్పించేసి తన సత్తా చాటుకున్నారు. ఆయన ఎవరో కాదు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన పార్టీలో తన ప్లేస్ ఏంటో చెప్పమంటూ వైవీకి లేఖాస్త్రం సంధించారు. నియోజకవర్గ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే నేరుగా జగన్ తోనే ఈ పంచాయతీ తేల్చేసి వాసుపల్లికి సీటు హామీ ఇచ్చేశారు.

అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలి అభ్యర్ధిని దగ్గరుండి మరీ వైవీ సార్ ప్రకటించేశారు. దాంతో ఆయన పవర్ ఏంటి అన్నది మిగిలిన నాయకులకు తెలిసిపోయింది. దాంతో అంతా ఆయన చుట్టూనే క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలీ అంటే వైవీ కరెక్ట్ రూట్ అని కూడా పార్టీలో భావిస్తున్నారుట. ఇక వైవీ విశాఖ జిల్లాలో పార్టీ ఎలా పటిష్టం చేయాలన్న దాని మీద కూడా సీరియస్ గానే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.

అదే టైమ్ లో తాను విశాఖ వైసిపీ కో ఆర్డినేటర్ గా ఉండగానే బ్రహ్మాండమైన సొంత బిల్డింగ్ ఒకటి పార్టీకి కట్టించాలని చూస్తున్నారు. ఇక అధికారులు కూడా వైవీ మీటింగులకు వెళ్తున్నారు. ఆయన సైతం వారితో మాట్లాడుతున్నారు. చేయాల్సిన పనులు చెబుతున్నారు. ఒక విధంగా మంత్రి కంటే ఎక్కువగా వైవీ హడావుడి ఉంది అంటున్నారు.

దాంతో దీని మీదనే ఉత్తరాంధ్రా టూర్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరీ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు విశాఖతో సంబంధం ఏంటి అని గట్టిగా సౌండ్ చేశారు. అయినా వైవీ ఎక్కడా తగ్గడంలేదు. వచ్చే ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. దానికి తగిన గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటూనే పార్టీని గాడిలో పెట్టే పనికి వైవీ నడుం బిగించారు అంటున్నారు.

మొత్తానికి విజయసాయిరెడ్డి స్టైల్ వేరు. వైవీ స్టైల్ వేరు అంటున్నారు. ఆయన ప్రత్యర్ధుల మీద విమర్శలు చేయడంలేదు, మీడియా ఫోకస్ కి చాన్స్ ఇవ్వడంలేదు. సైలెంట్ గానే దూసుకుపోతున్నారు. దాంతోనే టీడీపీ అధినేత ఆయన్ని టార్గెట్ చేశారు అంటున్నారు. మొత్తానికి వైవీ మార్క్ ఏంటో విశాఖ రాజకీయాల్లో అంతా తొందరలోనే చూస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు. పొరుగు జిల్లాల వారికి విశాఖతో పనేంటి అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. మరి వైవీ రేపిన ఈ కలకలం స్మార్ట్ సిటీ పాలిటిక్స్ ని ఏ తీరం చేరుస్తుందో చూడాల్సిందే.