Begin typing your search above and press return to search.

జమ్మూలో శ్రీవారి ఆలయం...స్థలాన్ని పరిశీలించిన వైవీ

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:35 PM GMT
జమ్మూలో శ్రీవారి ఆలయం...స్థలాన్ని పరిశీలించిన వైవీ
X
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఏటా కోట్లాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయినప్పటికీ, స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలకు విఘ్నం కలుగకుండా పూర్తి చేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూలో శ్రీవారి ఆలయం నిర్మించాలని గతంలో టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. అందలో భాగంగానే జమ్మూలో శ్రీవారి ఆలయం నిర్మించదలిచిన స్థలాన్ని ఆయన ఈ రోజు పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను జమ్మూ ప్రభుత్వానికి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు సమర్పించబోతున్నారని వైవీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని గతంలోనే టీటీడీ పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. కరోనా నేపథ్యంలో ఆ ఆలయ నిర్మాణ విషయంలో కొద్దిగా జాప్యం జరిగింది. ఇప్పటికే జమ్మూలో ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని టీటీడీకి జమ్మూ అధికారులు చూపించారు. తాజాగా ఆ స్థలాన్ని వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించిన తర్వాత జమ్మూ ప్రభుత్వం అనుమతితో ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని వైవీ తెలిపారు. ఇప్పటికే ముంబైలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. కాగా, చిత్తూరు జిల్లాలోని 7 దేవాలయాలు దేవాదాయ శాఖ నుంచి టీటీడీ ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.