Begin typing your search above and press return to search.

పెద్ద చుట్టం : వైవీ ఫోకస్ ఏదీ...?

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 AM GMT
పెద్ద చుట్టం : వైవీ ఫోకస్ ఏదీ...?
X
ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీకి రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులు అయ్యారు. ఆయన ఇప్పటికి రెండు సార్లు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. మరో మారు ఆయన విశాఖకు వస్తున్నారు. విశాఖలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమం కోసం వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు. మంత్రులు అంతా కలసి చేపడుతున్న బస్సు యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో వైవీ సుబ్బారెడ్డి విశాఖ టూర్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికి రెండు సార్లు వచ్చినా పార్టీ నేతలతో పరిచయ కార్యక్రమాలుగానే అంతా ఉంది తప్ప ఆయన పార్టీకి ఇచ్చిన సలహా సూచనలు కానీ బలోపేతం చేసే దిశగా తీసుకున్న చర్యలు కానీ పెద్దగా లేవని అంటున్నారు. పైగా అసలే విశాఖ జిల్లాలో వైసీపీ వీక్ అనుకుంటే పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిని ఒక్క లెక్కన మార్చేసి అక్కడ కలి పుట్టించారు అన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇక ఇప్పటికీ విశాఖ వైసీపీకి పెద్ద దిక్కు అంటే విజయసాయిరెడ్డినే అంతా చూస్తున్నారు. రీసెంట్ గా ఆయనకు రాజ్యసభ సీటు రెండవసారి రెన్యూవల్ అయింది. దాంతో ఆయన్ని అభినందించేందుకు విశాఖ జిల్లా నుంచి ముఖ్యమైన వైసీపీ నాయకులు అంతా తాడేపల్లికి భారీ ఎత్తున క్యూ కట్టేశారు. ఆయన్నికీలకమైన నేతలు కలసి తమ సమస్యలు చెప్పుకుని వచ్చారు.

ఒక విధంగా విశాఖ రాజకీయాల గురించి ఈ రోజుకీ విజయసాయిరెడ్డి తెలుసుకుంటున్నారు. ఆయనే అక్కడ టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్లేస్తున్నారు. విశాఖకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఇంకో వైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు అంటున్నారు. వయో భారంతో పాటు ఆయనకు ఉన్న ఇతర బాధ్యతల వల్ల ఆయన విశాఖకు పెద్దగా రాలేకపోతున్నారు అని అంటున్నారు.

మరి వైవీ ఫోకస్ కనుక విశాఖ వైసీపీ మీద పెట్టకపోతే రానున్న రోజులలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అదే టైమ్ లో పార్టీలో విజయసాయిరెడ్డి వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా కూడా విడిపోయిన నేపధ్యంలో మొత్తం పార్టీని లీడ్ చేసి పటిష్టపరచాల్సిన బాధ్యత పెద్దయన మీద ఉంది అంటున్నారు. మరి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే మాత్రం వైవీ విశాఖకు పెద్ద చుట్టంగానే మిగిలిపోతారు అని అంటున్నారు.