Begin typing your search above and press return to search.

బాబాయ్ చేతిలోకి విశాఖ ?

By:  Tupaki Desk   |   17 April 2022 6:32 AM GMT
బాబాయ్ చేతిలోకి విశాఖ ?
X
విశాఖ స్మార్ట్ సిటీ. అంతేనా అందరినీ ఆకట్టుకునే సిటీ. అన్నింటికీ మించి జగన్ కి విశాఖ అంటే మోజు ఎక్కువ అని చెబుతారు. ఎక్కడ పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నా విశాఖ విషయం వచ్చేసరికి ఆయన ప్రత్యేక దృష్టి పెడతారు. అలాంటి విశాఖను గత ఆరేళ్ళుగా విజయసాయిరెడ్డి చూశారు. ఆయన రాజ్యసభ మెంబర్ గా 2016లో నియమితులైన వెంటనే విశాఖకు వచ్చేశారు.

రాజ్యసభ సభ్యునిగా నోడల్ జిల్లాగా విశాఖను చేసుకుని ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి, ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ గాలి వెల్లువలా వీచడానికి విజయసాయిరెడ్డి కృషి కూడా ఉందని చెప్పాలి. అయితే పార్టీ సంస్థాగతంగా చేసే అనేక మార్పులలో భాగంగా ఉమ్మడి విశాఖ వైసీపీ బాధ్యతలు టీటీడీ చైర్మన్, జగన్ సొంత బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఈపాటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డికి ఈ మధ్యనే పార్టీ అనుబంధ విభాగాలకు ఇంచార్జిని చేశారు. ఆయన వాటిని యాక్టివ్ చేయాలి. అలా దాంతో పాటు ఢిల్లీలో బాధ్యతలు చూసుకోవాలి. ఇలా ఇతర బాధ్యతలు విజయసాయిరెడ్డికి చాలా ఉన్నాయి.

దాంతో విశాఖ ఉమ్మడి జిల్లా వైసీపీ బాధ్యతలను ఇక మీదట వైవీ సుబ్బారెడ్డి చూస్తారు అని తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రాలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చూసుకుంటారు అని కూడా అధినాయకత్వం డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్రాలో ఈసారి కూడా గత మ్యాజిక్ రిపీట్ చేయడానికి జగన్ రెడీ అవుతున్నారు. ఇక విశాఖ జిల్లా ఎటూ తన‌ ఫేవరేట్ కాబట్టి బాబాయ్ చేతిలో పెట్టారని అంటున్నారు.