Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మన్‌ గా మరోసారి ఆయనే ప్రమాణస్వీకారం !

By:  Tupaki Desk   |   11 Aug 2021 10:33 AM GMT
టీటీడీ చైర్మన్‌ గా మరోసారి ఆయనే ప్రమాణస్వీకారం !
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9.45 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌ గా అవకాశం ఇచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

శ్రీవారికి సేవ చేసే భాగ్యం మరోసారి దక్కడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి దక్కిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. తాజాగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యులను కూడా త్వరలోనే నియమిస్తామని బోర్డు ఇటీవల ప్రకటన చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 జూన్‌ 21న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌ గా నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్‌ కి రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. 2021 జూన్‌ 21కి సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. దీనితో రెండో సారి కూడా వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌ గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

బోర్డు స‌భ్యుల కాల‌ప‌రిమితి ఉన్న‌ప్ప‌టికీ, చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో బోర్డు కూడా ర‌ద్ద‌యింది. త‌న‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌ని ఉంద‌ని వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌టించ‌డంతో, కొత్త చైర్మ‌న్ వ‌స్తార‌ని అంతా భావించారు. అయితే ప్ర‌కాశం జిల్లాలో రెండు ప‌వ‌ర్ సెంట‌ర్ల‌ను కొన‌సాగించ‌డం ఇష్టం లేని జ‌గ‌న్‌, మరోసారి వైవీ సుబ్బారెడ్డిని శ్రీ‌వారి సేవ‌లోనే కొన‌సాగాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు రెండు రోజుల క్రితం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

వైవీ సుబ్బారెడ్డి మంగళవారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద ఆలయాల్లో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం కొనసాగిస్తూ, దేశంలోని ముఖ్య ఆలయాలన్నింటిలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకుపైగా కొనసాగుతోందన్నారు. శాశ్వతంగా కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శీష్రంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.