Begin typing your search above and press return to search.

బాబుది డ్రామా అవిశ్వాసం - వైసీపీ

By:  Tupaki Desk   |   18 July 2018 10:31 AM GMT
బాబుది డ్రామా అవిశ్వాసం - వైసీపీ
X
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆ కుటుంబానికి అన్యాయం చేసిన చంద్ర‌బాబు ఈసారి ఏకంగా త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఏపీకే వెన్నుపోటు పొడిచారు. ఆయ‌న రాజ‌కీయ విధానాల‌తో ఏప్రీ ప్ర‌యోజ‌నాల‌కు స‌మాధి క‌ట్టారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానించారు. గ‌త స‌మావేశాల్లో ఎన్డీయేకు విడాకులు, త‌న సొంత‌ అవిశ్వాసం - దీక్ష‌లు వంటి వాటితో ఉద్య‌మాన్నే చంద్ర‌బాబు త‌ప్పుదారి ప‌ట్టించార‌ని వారు ఆరోపించారు.

ప్ర‌జ‌ల్లో కోల్పోయిన ఆద‌ర‌ణ నిల‌బెట్టుకోవ‌డానికి చంద్రబాబు నాయుడు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు - మాజీ ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. గతంలో వైసీపీ అవిశ్వాసం పెడతానంటే రాష్ట్రం కోసం ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికైనా రెడీ అని చెప్పిన చంద్ర‌బాబు, త‌మ‌ను అవహేళన చేసి మ‌న డిమాండ్ల‌లో సీరియ‌స్ నెస్ లేకుండా చేశార‌న్నారు. ఆరోజే చంద్రబాబు.. తమకు మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు ఏపీకి ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు.

టీడీపీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా అటు బీజేపీతో - ఇటు కాంగ్రెస్‌ తో లోపాయ‌కారీ సంబంధాలు నెరుపుతూ పైకి మాత్రం ఎవ‌రితోనూ లేమ‌ని అబ‌ద్ధాలు చెబుతోంద‌న్నారు. టీడీపీ-బీజేపీ వ్యవహారం - పార్లమెంటు వ్యూహాలపై చర్చించేందుకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బుధవారం స‌మావేశమ‌య్యారు. అనంత‌రం మేకపాటి రాజమోహన్ రెడ్డి - వరప్రసాద్ - వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా - విభజన చట్టం హామీల అమలు సాధించేది వైసీపీ మాత్ర‌మే అని, అంత‌ వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్ప‌ష్టంచేశారు. అస‌లు అవిశ్వాసాన్ని ప‌లుచ‌న చేసిన‌ చంద్రబాబుకు అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు లేద‌న్నారు. ఇది టీడీపీ-బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్ అవిశ్వాసం అన్నారు.

ఇదిలా ఉండ‌గా బుధవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైసీపీ నేతలు నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగుదేశం మోసాలు ఆపాల‌ని - రాష్ట్ర ప్ర‌యోజనాల కోసం నిజ‌మైన కృషి చేయాల‌ని డిమాండ్ చేశారు.