Begin typing your search above and press return to search.

రాజ్‌ నాధ్ ఉవాచ : తెదేపా వన్నీ డ్రామాలే!

By:  Tupaki Desk   |   7 Feb 2018 6:40 AM GMT
రాజ్‌ నాధ్ ఉవాచ : తెదేపా వన్నీ డ్రామాలే!
X
ఆదివారం నాడు తెలుగుదేశం ఎంపీలతో చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించి, తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని దిశానిర్దేశం చేస్తున్న సమయంలో రాజ్ నాధ్ సింగ్ ఫోను చేసి.. ఆవేశం వద్దని - తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వేచిచూడాలని.. మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆదివారం నాడు హామీ ఇచ్చినట్లుగానే.. ఆయన సోమవారం నాడు తెలుగుదేశం ఎంపీలను కలవడానికి అపాయింట్‌ మెంట్ ఇచ్చారు. తానుగా స్పందించి వారిని తొందరపడవద్దని చెప్పి - తన వద్దకు పిలిపించుకుని - తానై సమయం కేటాయించిన కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్.. కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలోనే తెదేపా ఎంపీల్తో భేటీ ముగించి.. వారిని పంపేసినప్పుడు చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇంత త్వరగా ముగిసిపోయిందేమిటి చెప్మా అని అనుకున్నారు. అయితే అసలు కీలకం ఇప్పుడు బోధపడుతోంది. తెలుగుదేశం ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారే తప్ప.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని రాజ్ నాధ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోం మంత్రి తమతో ఆ మాట చెప్పినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు బుధవారం ఉదయం వెల్లడించారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిషకారానికి వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు బుధవారం ఉదయం హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. విభజన చట్టం లో హామీ ఇచ్చిన మేరకు ఆ అంశాలన్నిటినీ పరిష్కరించాలని వైసీపీ ఎంపీలు హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ భేటీ అనంతరం మీడియాకు వారు వివరాలను వెల్లడించారు.

పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న వైఖరి మీద రాజ్ నాధ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వైవీ సుబ్బారెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది. తమ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటున్నప్పటికీ కూడా , అరుణ్ జైట్లీ చర్చలకు ఆహ్వానించినా కూడా రాకుండా.. తెలుగుదేశం ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారంటూ హోంమంత్రి తమతో అన్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. చూడబోతే.. తెలుగుదేశం వారు చేస్తున్న ఆందోళనలు - సమస్య పరిష్కారానికి కాకుండా.. తమకు మైలేజీ కోసం - కేంద్రాన్ని బద్నాంచేయడం కోసమే జరుగుతున్నట్లుగా ఉన్నదని భాజపా భావిస్తున్నట్లుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.