Begin typing your search above and press return to search.

తెదేపాకు వైకాపాకు తేడా అదే మరి!

By:  Tupaki Desk   |   6 Jan 2018 4:15 AM GMT
తెదేపాకు వైకాపాకు తేడా అదే మరి!
X
ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసాయి. రాష్ట్రానికి చెందిన ఎంపీలు చాలా వరకు ఢిల్లీ వీడి ఇక సొంత ప్రాంతాలకు వచ్చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి రెండు పార్టీలు తెదేపాకు - వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు శుక్రవారం నాడు ఒకే పని చేశారు. అదేంటంటే.. ప్రధానికి రాష్ట్ర సమస్యల గురించి - వాటి కోసం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి ఆయనకు వినతిపత్రాలు ఇచ్చారు. కేంద్రమంత్రి కూడా ఉన్న తెదేపా ఎంపీల బృందానికి అపాయింట్ మెంట్ దొరకడంతో వారు నేరుగా వెళ్లి 16 పేజీల లేఖ ఇచ్చారు. అదే సమయంలో వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా సుదీర్ఘమైన లేఖలో అనేక అంశాలను ప్రధానికి విన్నవించారు. ఈ రెండు లేఖల్లో ఉన్న అంశాల్లో తేడాను గమనిస్తేనే రెండు పార్టీల బుద్ధులు - వ్యత్యాసాలు తెలిసిపోతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం ఎంత కీలకం అయినదో అందరికీ తెలుసు. హోదా అంటూ వస్తే.. పారిశ్రామికంగా ఎవ్వరినీ దేబిరించాల్సిన అవసరం లేకుండానే పరిశ్రమలు వస్తాయని, యువతకు లెక్కకు మిక్కిలిగా ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని అందరికీ తెలుసు. ఈ సంగతిలో తెదేపాకు కూడా స్పష్టత ఉంది. మొన్నటికి మొన్న గుంటూరులో భాజపా నాయకులతో తగాదా పెట్టుకున్నప్పుడు రాష్ట్రానికి కీలకం అయిన ప్రత్యేక హోదాను ఎగవేసి మీరు ద్రోహం చేయలేదా అంటూ తెదేపా నాయకులు గొడవ పడ్డారు. దాని విలువ ఏమిటో వారికి తెలిసినప్పటికీ.. ప్రధానికి ఇచ్చిన 16పేజీల వినతిపత్రంలో ఎక్కడా ప్రత్యేకహోదా ఊసును కూడా వారు ప్రస్తావించలేదు.

అదే వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధానికి రాసిన లేఖలో ప్రధానంగా ప్రత్యేక హోదా అంశాన్నే ప్రస్తావించారు. రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా వనరుల పరంగా నిలదొక్కుకునే వరకూ కేంద్రం చేయూత అందించాలనే విషయాన్ని వైసీపీ లేఖలో మాత్రమే ప్రస్తావించారు. రాష్ట్రానికి కీలకమైన ఏ అంశాన్ని కూడా విస్మరించకుండా ఆయన పేర్కొన్నారు.

అయితే తెదేపా ఎంపీలు ఉమ్మడిగా వెళ్లడం వల్ల రాష్ట్ర అంశాలను మాత్రమే ప్రస్తావించారు. సుబ్బారెడ్డి విడిగా లేఖ రాసిన నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు పరిధిలోని అంశాలను కూడా ఆయన అందులో పొందుపరిచారు. ఆ రకంగా చూసినప్పుడు కేంద్రం దృష్టి సారించాల్సిన కీలకమైన చిన్న విషయాలను కూడా వైసీపీ మాత్రమే ప్రధానికి దృష్టికి తీసుకువెళ్లినట్లు అయింది.

కేంద్రం ఎవరి వినతుల మీద ఎలా స్పందిస్తుందో తర్వాతి సంగతి. మన ప్రయత్నలోపం లేకుండా విన్నపాలు చేయడంలోనే.. హోదా వంటి కీలక అంశాల్ని విస్మరించడం తెదేపాకు ధర్మం కాదని, కనీసం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం సాయం అందడం లేదనే మాట కూడా వారి లేఖలో లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.