Begin typing your search above and press return to search.

బాబు నిర్ల‌క్ష్య‌మే ఏపీకి శాపం

By:  Tupaki Desk   |   9 Feb 2018 9:36 AM GMT
బాబు నిర్ల‌క్ష్య‌మే ఏపీకి శాపం
X
ఈరోజు చంద్ర‌బాబు - తెలుగుదేశం పార్టీ కేంద్రంపై దాడి చేస్తున్న‌ట్లు గ‌ట్టిగా న‌టిస్తున్నారు. అస‌లు రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్ త‌ర్వాత రెండో బాధ్యుడు చంద్ర‌బాబే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బాబు నిర్ల‌క్ష్య వైఖ‌రి - స్వార్థ ప్ర‌యోజ‌నాల వ‌ల్లే రాష్ట్రం న‌ష్ట‌పోయింద‌న్నారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు దొరికిపోయిన‌పుడే ఆయ‌న కేంద్రం చేతిలో పావుగా మారార‌ని - ఆరోజు నుంచి రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై నోరు మెద‌ప‌డం మానేశార‌ని వైవీ సుబ్బారెడ్డి విమ‌ర్శించారు.

ఈ విష‌యాన్ని ప్ర‌కాశం జిల్లా వైసీపీ నేత ఐవీ రెడ్డి కూడా అనేక సార్లు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్ర‌త్యేక హోదా రాబోద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిన్న బంద్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చిన స‌మ‌యంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబును ఎన్నుకుని ఎంత పెద్ద త‌ప్పు చేశారో అర్థం చేసుకున్నార‌ని - వాళ్లు ఇప్ప‌టికే జ‌గ‌న్ వైపు మారిపోయార‌ని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండ‌గా టీడీపీ నాట‌కాల‌పై వైఎస్‌ ఆర్‌సీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద విధానాలు పాటిస్తున్నార‌న్నారు. బీజేపీ నేతల ప్రశ్నలకు వెంట‌నే స‌మాధానాలిచ్చి నిల‌దీయ‌కుండా మాట ఎందుకు మారుస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ లో ఒకలా - బయట మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లి తన అవినీతి సొమ్ము దాచుకొంటున్నార‌న్నారు. ఇంత‌వ‌ర‌కు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో ఎన్ని ఒప్పందాలు జ‌రిగాయో ఒక శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి వరప్రసాదినైన ప్రత్యేక హోదాను కాదని ఎవరికీ తెలియకుండా ప్రత్యేక ప్యాకేజీకి చంద్ర‌బాబు ఎందుకు ఒప్పుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేత‌ - మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏడాదిలోపే ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని టీడీపీ నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, తద్వారానే పరిశ్రమలు వస్తాయని, అవి వస్తేనే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. జ‌గ‌న్ మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుత‌న్నార‌ని, ఎన్నిక‌లు రాగానే ఆ మైలేజీ త‌న కోటాలో వేసుకోవ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని బాలినేని మండిప‌డ్డారు.