Begin typing your search above and press return to search.

మిస్డ్ కాల్ కాదు.. ఆన్సర్ చేసిన షర్మిల.. ఇంతకూ ఆ కాల్ ఎవరి నుంచి అంటే?

By:  Tupaki Desk   |   21 May 2023 10:58 AM GMT
మిస్డ్ కాల్ కాదు.. ఆన్సర్ చేసిన షర్మిల.. ఇంతకూ ఆ కాల్ ఎవరి నుంచి అంటే?
X
ఈ మధ్యన షర్మిల నోటి నుంచి వచ్చిన ఒక మాట సంచలనంగా మారింది. తనకు కాంగ్రెస్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని.. తాను ఆ కాల్స్ ను అటెండ్ చేయట్లేదని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని.. అలా అయితే తాను ఇన్ని కష్టాలు పడి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద పోరాటాలు చేస్తున్న ఏకైక అధినేతగా ఆమెను ఆమె చెప్పుకొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు కాల్స్ వస్తున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తనకు వస్తున్న కాల్స్ కు తాను ఆన్సర్ చేయట్లేదన్న షర్మిల.. ఇంతకు ఆమెకు ఫోన్ కాల్స్ ఎవరి నుంచి వస్తున్నాయి? ఏ స్థాయి కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీయగా.. కొత్త నిజాలు వెలుగు చూశాయి. ఆమెకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వారు ఇస్తున్న సమాచారాన్ని చూస్తే.. ఆమెకు కాంగ్రెస్ నుంచి కాల్స్ రావటం ఎంత నిజమో.. ఆమె వాటిని లిఫ్టు చేసి సుదీర్ఘంగా మాట్లాడింది అంతే నిజమని చెబుతున్నారు.

ఇంతకు షర్మిలకు ఫోన్ చేసిందెవరో కాదు. కాంగ్రెస్ అధినాయకత్వంలో కీలకంగా వ్యవహరించే ప్రియాంక వాద్రా. దాదాపు నెల క్రితం షర్మిలతో ప్రియాంకతో చాలాసేపు మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు ముందుగా వస్తున్న వేళ.. కలిసి పని చేద్దామని.. ఏపీ రాజకీయాల్లోనూ చురుకైన పాత్రను పోషించాలని ప్రియాంక కోరినట్లుగా తెలుస్తోంది. షర్మిలకు నచ్చజెప్పి.. కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహితంగా చేయటంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.

బెంగళూరులో ఎక్కువ కాలం ఉన్న షర్మిలకు డీకే ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరి రెండు కుటుంబాలకు మధ్య రాకపోకలు ఎక్కువేనని చెబుతారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయాలని షర్మిలను కోరినా.. అందుకు ఆమె ససేమిరా అన్నట్లుగా చెబుతున్నారు. షర్మిల వల్ల తెలంగాణ కంటే ఏపీలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రయోజనకరమని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణలో ముందుగా కలుపుకు వెళ్లి.. తెలంగాణలో అధికారాన్ని తెచ్చుకోగలిగితే.. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజకీయ వారసురాలిగా ప్రకటించాలన్న ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రపోజల్ విషయంలో షర్మిల అవునని కాని.. కాదని కాని చెప్పలేదంటున్నారు. మరికొందరు మాత్రం అందుకు ఓకే చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం జగన్ కు గంపగుత్తిగా వెళ్లిపోయింది. అలాంటి వైఎస్ వారసురాలిగా కాంగ్రెస్ షర్మిలను తెర మీదకు తీసుకొస్తే.. పార్టీకి మళ్లీ మంచిరోజులు వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. షర్మిల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. తాను తొలుత తెలంగాణలో సత్తా చాటిన తర్వాత ఏపీ వైపు చూస్తానన్న మాట అంటున్నట్లు చెబుుతన్నారు. మొత్తంగా షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ చేస్తున్న కొత్త వ్యూహరచన రానున్న రోజుల్లో ఏ దిశగా సాగుతుందో కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.