Begin typing your search above and press return to search.

రాజ్యసభలో ఐదో పెద్ద పార్టీగా అవతరించనున్న వైఎస్సార్సీపీ!

By:  Tupaki Desk   |   1 Jun 2022 12:30 PM GMT
రాజ్యసభలో ఐదో పెద్ద పార్టీగా అవతరించనున్న వైఎస్సార్సీపీ!
X
రాజ్యసభలో ఐదో పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించనుంది. తాజాగా ఆ పార్టీ తరపున నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నిక కావడానికి నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీరితో కలిపి వైఎస్సార్సీపీ బలం రాజ్యసభలో 9కి చేరనుంది. దీంతో రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తర్వాత ఐదో పెద్ద పార్టీగా నిలవనుంది.

ప్రస్తుతం ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన విజయసాయిరెడ్డి, బీజేపీకి చెందిన సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల పదవీకాలం పూర్తవుతున్న విషయం తెలిసిందే. వీరి స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ప్రతిపక్ష పార్టీలేవీ పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం.

వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావాల్సిన 44 మంది ఎమ్మెల్యేల బలం ప్రతిపక్ష పార్టీల్లో దేనికీ లేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు నామినేషన్లు వేసిన నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

ఇప్పటికే వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభలో ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, విజయసాయిరెడ్డి, పరిమళ్ నత్వానీ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం విజయసాయిరెడ్డి పదవీ కాలం ఈ జూన్ తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ ఆయనను వైఎస్సార్సీపీ తిరిగి రాజ్యసభకు పంపుతోంది. దీంతో ఆ పార్టీ తరఫున ఇప్పుడున్న ఐదుగురితోపాటు ఎన్నిక కానున్న నలుగురితో ఆ పార్టీ బలం 9కి చేరనుంది.

భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభలో అత్యధికంగా 95 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 29 మంది ఉన్నారు. మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున 13 మంది, డీఎంకే తరఫున 10 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ నాలుగు పార్టీల తర్వాత స్థానంలో వైఎస్సార్సీపీ నిలవనుంది.

కాగా 2024 ఏప్రిల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ రెండు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ముందుకు జరిపితే ఈ రెండింటిని కూడా వైఎస్సార్సీపీ దక్కించుకోనుంది.

అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి, పార్లమెంటకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఎన్నికల అనంతరం ఈ రెండు సీట్లకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇస్తే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తేనే వాటిని గెలుకోగలదు. లేదంటే సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఖాళీ చేసే సీట్లను దక్కించుకోలేదు. అదృష్టం బాగుండి గెలుచుకోగలిగితే ఏపీ నుంచి రాజ్యసభకు ఉన్న మొత్తం 11 సీట్లను ఆ పార్టీయే గెలుచుని రికార్డు సృష్టిస్తుంది.