Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వెళ్లినా ఏం ఉప‌యోగం లేదు!

By:  Tupaki Desk   |   2 Dec 2021 8:00 PM IST
వైసీపీలోకి వెళ్లినా ఏం ఉప‌యోగం లేదు!
X
సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి వ‌ల‌స‌లు ఉంటాయి. ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీలో చేరితే త‌మ‌కు రాజ‌కీయంగా వ్య‌క్తిగ‌తంగా ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని విప‌క్షాల నాయ‌కులు అనుకుంటారు. అందుకే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిక‌లుంటాయి. మ‌రోవైపు ఈ చేరిక‌ల వ‌ల్ల ప్ర‌త్య‌ర్థిని బ‌ల‌హీనం చేయొచ్చ‌నే అధికార పార్టీ ల‌క్ష్యం కూడా నెర‌వేరుతుంది. అందుకే ఇటు అధికార పార్టీ కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు ఆస‌క్తి చూపిస్తుంటుంది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. మొద‌ట చేసిన ప‌ని ఇదే. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి ఆక‌ర్షించి త‌న‌కు పోటీ లేకుండా చూసుకోవాల‌ని అనుకున్నారు.

ఇక ఏపీలో కూడా అదే ప‌రిస్థితి ఉంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకుని కొంత‌మంది.. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం త‌ర్వాత మ‌రికొంత మంది వైసీపీలో చేరారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధిస్తామ‌నే ధీమాతో ఉన్నారు. కానీ గ‌త ఆరు నెల‌ల నుంచి వైసీపీలోకి చేరిక‌లు ఆగిపోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుపుపై ధీమాతో ఉన్న పార్టీలోకి టీడీపీ గ్రామ‌స్థాయి నేత‌లు కూడా చేర‌డం లేదు. అయితే అందుకు ఓ కార‌ణం ఉంది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లితాలు నేరుగా అందుతున్నాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే గ్రామ వాలంటీర్లే చూసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు అస‌లు ఏం ప‌ని ఉండ‌డం లేదు. ఒక్క పెన్ష‌న్ ఇద్దామ‌న్నా ఇప్పుడు ఆ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆన్‌లైన్ కావ‌డంతో ఇక్క‌డ సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌గానే అక్క‌డ ప్ర‌జ‌ల ఖాతాల్లో సొమ్ము ప‌డిపోతోంది. దీంతో సొంత పార్టీ నేత‌లే ఏం చేయ‌లేక‌పోతున్నారు.. ఇక తాము వైసీపీలోకి వెళ్తే ఏం ఉప‌యోగం ఉండ‌ద‌ని భావించే తెలుగు త‌మ్ముళ్లు ఆగిపోతున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు టీడీపీ వ్యూహాలు విభిన్నంగా ఉంటాయి. రాష్ట్రంలో స్థానిక, పంచాయ‌తీ, ప‌రిష‌త్ ఇలా ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓడిన‌ప్ప‌టికీ దాని ప్ర‌ధాన ల‌క్ష్యం అసెంబ్లీ ఎన్నిక‌లే. 2014లోనూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ముందు రాష్ట్రంలో జ‌రిగిన వివిధ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచింది. కానీ తీరా 2014 ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ గెలిచి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ చేతిలో టీడీపీకి చావుదెబ్బ త‌ప్ప‌డం లేదు. అయినా ఆ పార్టీ క్యాడ‌ర్ నిరుత్సాహ‌ప‌డ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం పార్టీ ప్ర‌త్యేక వ్యూహంతో గెలుస్తుంద‌న్న‌ది వాళ్ల న‌మ్మ‌కం. పైగా టీడీపీకి క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది. ప‌రాజ‌యాలు ఎదురైనా ఆ పార్టీ క్యాడ‌ర్ చెక్కు చెద‌ర‌లేన‌ది తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పోరాడే టీడీపీలోనే ఉండాల‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నార‌ని స‌మాచారం. వైసీపీలోకి వెళ్లి చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ‌డం కంటే కూడా టీడీపీలోనే ఉండి పార్టీ విజ‌యం కోసం కృషి చేయాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.