Begin typing your search above and press return to search.

టీడీపీ యాక్షన్ కు వైసీపీది రియాక్షేనేనా ?

By:  Tupaki Desk   |   4 March 2021 2:30 AM GMT
టీడీపీ యాక్షన్ కు వైసీపీది రియాక్షేనేనా ?
X
అధికారంలో ఉన్నపుడు ఎవరికైనా కళ్ళు మూసుకుని పోతుందనటంలో సందేహం లేదు. తాము ఏమి చేసినా అడిగే వాళ్ళు ఉండరనే పాలకులు అనుకోవటం సహజం. ఇపుడు స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ అందుకుంటున్న ఏకపక్ష విజయాలు దాదాపు ఇలాగే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సహజంగానే ప్రత్యర్ధులు నామినేషన్లు వేయకపోవటంతో వైసీపీ గెలుస్తోంది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ఒత్తిళ్ళు తీసుకొచ్చి ప్రత్యర్ధులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలున్నాయి. ఇందులో వాస్తవాలు కూడా ఉండచ్చు అనుమానం లేదు.

అయితే ఇప్పటి అధికారపార్టీ నేతల వైఖరి మొత్తం ఒకప్పటి టీడీపీ నేతల వ్యవహారం కారణంగానే జరుగుతున్నాయనే చెప్పాలి. అంటే అప్పటి టీడీపీ నేతల యాక్షన్ కు ఇప్పటి వైసీపీ నేతల రియాక్షన్ అనే అర్ధమవుతోంది. 2014-19 మధ్య టీడీపీ నేతలు ఇలాగే వ్యవహరించారు. అప్పట్లో జరిగిన స్ధానికసంస్ధల కోటాలో భర్తీ చేసిన ఎంఎల్సీ ఎన్నికలు కావచ్చు, నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికా కావచ్చు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్ధానికసంస్ధల్లో మెజారిటి ఉందన్నది వాస్తవం.

మరి పై జిల్లాల్లో అప్పటి ప్రతిపక్ష వైసీపీకి మెజారిటి ఉన్నా గెలిచింది మాత్రం టీడీపీనే. మెజారిటి ఓట్లున్నప్పటికి వైసీపీ అభ్యర్ధి ఎలా ఓడిపోయారు ? ఎలాగంటే వైసీపీ ఓటర్లను టీడీపీ నేతలు బెదిరించి, కుటుంబసభ్యులను అదుపులో ఉంచుకుని, డబ్బులు, కాంట్రాక్టులిస్తామని ప్రలోభాలు పెట్టి, కొందరి ఓట్లను తీసేసి ఇలా రకరకాల పద్దతుల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకున్నారు.

ఇక నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ గెలిచిన విధానం గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. వైసీపీ అభ్యర్ధినే స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా చేశారు. అభ్యర్ధి తరపు ప్రధాన ఎలక్షన్ ఏజెంటు గృహనిర్భంధం చేసేశారు. వాళ్ళకు ఒక సొసైటీ ఉంటే దాని బ్యాంకు ఖాతాలను నిలిపేశారు. వైసీపీలోని కీలక నేతల వెనుక షాడో పార్టీలను పెట్టారు. వాళ్ళ ప్రతికదలిక పైనా అడుగడుగునా నిఘా ఉంచారు. ఎన్నికల పరిశీలకులు కూడా వైసీపీ ఫిర్యాదులను పట్టించుకోలేదు.

చివరకు పోలింగ్ రోజున కూడా అడ్డదిడ్డమైన నిబంధనలను తెరపైకి తెచ్చి వైసీపీ అభ్యర్ధితో పాటు నేతలను స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా చేసి మొత్తానికి ఉపఎన్నికను గెలిచామనిపించుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2014లో వైసీపీ గెలిచినపుడు ఎన్ని ఓట్లొచ్చాయో ఉపఎన్నికలో ఓడినపుడు కూడా దాదాపు అన్నే ఓట్లొచ్చాయి. అంటే అప్పట్లో ఉపఎన్నిక ఫెయిర్ గా జరిగుంటే వైసీపీ అభ్యర్ధే గెలిచుండేవారు. అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన టీడీపీ చర్యలకు ఇపుడు ఎదురవుతున్నది ప్రతిచర్యలు మాత్రమే.